చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గ
కనకదుర్గమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా అమ్మవారు శనివారం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవిగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
అమ్మవారిని జన్మ నక్షత్రాన అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక అమ్మవారి ఐదో అవతారం గురించి కాస్త తెలుసుకుందాం...
* స్కందమాత...
దుర్గామాత ఐదో స్వరూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఈయనకే కార్తికేయుడు అని పేరు. ఈయన దేవ, అసుర యుద్ధంలో దేవతల సేనకు అధిపతిగా ఉన్నాడు. మయూర వాహనుడు. స్కందునికి తల్లి కాబట్టి దుర్గాదేవి ఐదో అవతారంలో స్కందమాతగా నవరాత్రుల్లో పూజలందుకుంటోంది.
ఈమె మూర్తిలో బాలస్కందుడు చిన్నచిన్న ఆరుతలలతో తల్లి ఒడిలో కూర్చుని ఉంటాడు. స్కందమాత చతుర్భుజి. ఒక చేతిలో కొడుకును పట్టుకుని ఉంటుంది. కమలం, పద్మం పట్టుకుని మరో చేత్తో అభయముద్ర ఇస్తుంటుంది. శ్వేతవర్ణశోభిత, సింహ వాహనురాలు, పద్మాసన అని కూడా పిలుస్తారు. స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ తీరుతాయి. ఈమెకు చేసిన పూజలు స్కందునికి చేరతాయి. భక్తులు శాంతిసుఖాలు అనుభవిస్తారు.