విజయదశమి నాడు 3 ప్రమిదెలు, 9 వత్తులు తీసుకోండి!
శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి నాడు సూర్యోదయమునకు ముందే నిద్ర లేవాలి. ఉదయం ఐదింటికి నిద్రలేచి.. తలస్నానము చేసి పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించి పూజకు రాజరాజేశ్వరి ఫోటో గానీ దుర్గాదేవి ప్రతిమను ఫోటోను సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి కనకాంబరములు, నల్ల కలువపూవులు, నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి.
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విజయదశమి పూజ చేయవచ్చు. ఈ పర్వదినము శుక్రవారం పూట వస్తే చాలామంచిది. పూజకు ముందు రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరి సహస్ర నామాలు, దేవి భాగవతమును పారాయణము చేయాలి.
ఇంకా విజయదశమి రోజున దుర్గాదేవి, శ్రీశైలం ఆలయాలను దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితాసహస్రనామము, నవరాత్రి వ్రతము, శ్రీదేవి లీలామృతం, రాజరాజేశ్వరి నిత్యపూజ, నవరాత్రి ఉత్సవములు, కోటి కుంకుమార్చన వంటి పూజలు.. పంచామృతముతో అభిషేకము నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
దీపారాధనకు మూడు ప్రమిదెలు, 9 వత్తులు తీసుకోవాలి. హారతికి ఆవునేతిని, దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. నుదుట కుంకుమను ధరించి, శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తామరమాల ధరించి, ఆగ్నేయము వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు