గురుదేవోభవ
"వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరుపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమోనమః"
వేదమూర్తియైన వశిష్ఠుని వంశంలో జన్మించిన వేదవ్యాస మహామునే విష్ణువు. విష్ణువే వేదవ్యాస మహాముని. అట్టి మహనీయునికి నమస్కారం.
పరాశరులు సత్యవతిని వివాహమాడినపుడు శ్రీమహావిష్ణువు నీ కుమారునిగా నేను జన్మించగలనని తెల్పాడు. ఆ కారణంతో ఆయనే వ్యాసమహర్షియై జన్మించాడు. నాది సాధారణమైన మానవజన్మ కాదని నిర్ధారించుటకుగాను పుట్టిన వెంటనే ఏడు సంవత్సరాల బాలునివలె రూపొందాడు. నదీ మధ్యమున నల్లనివాడుగా జన్మించటం వలన ఈయనకు కృష్ణ ద్వైపాయనుడను పేరుకూడా ఉంది. వేదాలు ఆపౌరుషేయాలు. భగవద్ధతములు. వాటిని పరిష్కరించి ఋగ్యజుస్సామాధర్వణ వేదాలుగా లోకానికి అందించిన పరబ్రహ్మస్వరూపుడైన ప్రధమగురువు వేదవ్యాసమహర్షి.
ఆయన ఉపనిషత్తుల తత్వాన్ని,భారత, భాగవతాలను, భారతంలో ప్రధానంగా భగవద్గీతను, అష్టాదశపురాణాలను ఇంకా ఎన్నో తాత్విక శాస్త్ర గ్రంధాలను రచించి ప్రపంచానికి అందించి భారత దేశ తాత్వికత ప్రపంచ దేశాలలో మకుటాయమానమైనదని తలంపజేశారు.
లోకకళ్యాణానికై మహాత్ములు జన్మిస్తారు. సకల జనుల శ్రేయస్సుకై తమ మనుగడను సాగించి చరితార్ధులు అవుతారు. శ్రీ వ్యాస భగవానుడు దైవకార్యాన్ని నిర్వహించేదానికి గాను జన్మించిన దినమే ఆషాఢ పూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమ అని, గురుపూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున దేశంలోని గురువులందరూ పూజింపబడుతారు. ఉత్తమ గురువులు త్యాగధనులు కావునా కాషాయ వస్త్రాలను ధరించి నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తారు.
" గు " శబ్దం అంధకారానికి పేరు. " ఋ " శబ్దం దాని వినాశనం చేయు ప్రకాశం. అనగా అజ్ఞానమనెడి చీకటిని పారద్రోలి స్వయంప్రకాశకమగు పరబ్రహ్మను తెలియజేయునది అని అర్ధం.
జననీ జనకులు శరీరమిచ్చి పోషించి, కాపాడిన వారు. వారిని జ్ఞప్తియందు వుంచుకొని కృతజ్ఞత భావంతో మెలుగుతూ వుంటాము. అదే విధంగా సోదరులు, స్నేహితులు, బంధువులు మానసిక, సాంఘిక బంధుత్వంగల వారు కావునా వారితో మర్యాద, మన్ననలతో నడుచు కున్తుంటాము వీరందరితోడి సంబంధము ఇలాంటిది కాదు.
వ్యక్తీ జీవించి వున్నంతవరకే. కాని గురువుతోడి సంభందము ఇలాంటి కాదు. అది ఆధ్యాత్మికమైనది అతడు తన శిష్యుని తరింపజేయునట్టి మహత్యమును ప్రసాదించినాడు. కాబట్టి అందరికంటే గురువు ఉత్తమమైనవాడుగా గుర్తింపబడ్డాడు.
గురువు లేకపోయినా జ్ఞానం కలగటం అసంభవం. భారత దేశంలో సుప్రసిద్ధమైన మహాత్ములందరికీ గురువులున్నారు. శ్రీరామునకు, శ్రీకృష్ణునికి గురువులున్నారు. అదేవిధంగా శ్రీ శంకరులు, శ్రీ రామకృష్ణులవారికి గురువులున్నారు. వారు సహజంగానే సద్గురువులు. కానీ వారు గురువులనే ఆశ్రయించే జ్ఞానాన్ని పొందారు. పూర్ణత్వము పొందినట్టివారికి గురువు అవసరంలేదు. కాని అట్టివారు ఎవరని చెప్పగలం?
నీవు చదివిన విద్య ఎట్టిదో తెలుపమని తండ్రియగు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా " చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ " అని అంటాడు. చదువులలో మర్మమేమంటే ఏమిటీ? అదే ఆత్మజ్ఞానం. " అహం బ్రహ్మాస్మి "తాను శరీరం కాదు " ఆత్మ " అనే జ్ఞానాన్ని పొందడం. నీవు ఇప్పుడు అహంకారాన్ని వదలి భగవంతుని శరణాగతి వేడితే నీలో వున్నా ఆత్మయే సద్గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు.
గురుపూర్నిమనుండే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. సద్గురువులు వ్రతదీక్షబూని తమ శిష్యులకు మార్గదర్శకులవుతారు. గురుశిష్య సాంప్రదాయం చాల గొప్పది. ఒక గురువు వద్ద తయారైన సత్య నిష్ఠగల శిష్యుడు, మరికొంతమంది శిష్యులకు గురువై సద్గురు సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు.
నమోస్తు గురువే తస్మై! ఇష్టవేదా స్వరూపిణే
యస్యవాఖ్యామృతం హంతి విషసంసారి పజ్ఞ్కిలం
ఎవరి అమృతవాక్కుల వల్ల సంసారమనే విషంనుండి తరుణోపాయం లభిస్తుందో ,ఆ గురువునకు నమస్కారం. సడుగురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆయన ప్రక్కన భగవంతుడే నిలుచుంటే ప్రథమ నమస్కారం సద్గువురుకే అని అంటాడు కబీర్దాస్.