పూర్వం తేజః పురము అనే పట్టణాన్ని ఋతంభరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు అనేకమంది భార్యలున్నారు. ఆయన పరమధార్మికుడు. ఉత్తముడు, మహా ఐశ్వర్య సంపన్నుడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూచినా నిరతాన్నదానం జరిగేదట. యతులకు, బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు సమస్త సౌకర్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవత. అలాంటి రాజ్యం ఆయనది. అయినా ఆయనకు సంతానం కలుగలేదు. ఆయన జాబాలి దర్శనం చేసుకున్నాడు. ఆ ఋతంభర రాజు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించి తనకు సంతానం లేదని, పుత్రభిక్ష పెట్టమని అడిగాడు.
అందుకు బదులుగా జాబాలి మహర్షి ఆయనతో, "రాజా! సంతానం లేని వాళ్లకు సంతానం కలగాలంటే మూడే మార్గాలున్నాయి. అవి వాసు దేవార్చనము (విష్ణు పూజ), వామదేవార్చనము (శివపూజ), గోసేవ. అందుకనే సుదక్షిణా దేవిని, దిలీప చక్రవర్తిని వసిష్ఠుడు సంతానం కోసం గోసేవ చేయమన్నాడు. ఈ సేవల వలన ఎంత పాపం చేసిన వాడికయినా, ఎంత పుణ్యం లేని వాడికయినా కూడా సత్సంతానం కలుగుతుంది. నీకు ముఖ్యంగా గోసేవ చేయమని చెప్తున్నాను. అది నీకు మంచిది. ఎందుకంటే గోవు శరీరంలో దేవతలుంటారు. ప్రతిదినము గోవుకు గడ్డి పెట్టి దానికి సేవచేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. సంతానాన్ని ఇస్తారు.
ఋతుమతి అయిన కుమార్తె అవివాహితగా ఉండడం, పశువుల కొట్టంలో ఆవు ఆకలితో ఉండడం, నిర్మాల్యం తీయనటువంటి దేవతార్చనము - ఈ మూడు కార్యములు పుణ్యం నశించడానికి హేతువులు. కాబట్టి శుభ్రం చేసి దేవతార్చన చేయాలి" అని బోధించాడు.
గోవుల ఆకలి తీర్చటం, దేవతార్చన చేయటం ఒకటేనన్నమాట. గడ్డి తినే ఆవుకు అడ్డం వచ్చి ఈ గడ్డి నాది అని దెబ్బలాడతాడు ఒకడు. తన పెరట్లో గడ్డి తింటుంటే ఆవును కొట్టాడంటే ఆ గడ్డి తనదేనని అన్నట్లే కదా! అంటే గడ్డి అది తానూ తినాలి వెంటనే! ఎంత తప్పు అది! కాబట్టి అది మహాపాపం అని చెప్పాడాయన) "గడ్డి తినే ఆవును అడ్డగించిన వాడు పితృదేవతలను బాధించినట్లే. ఆవును కాళ్ళతో తన్నరాదు. అట్టివాడు యమలోకానికి పోతాడు" అని కూడా జాబాలి మహర్షి చెప్పాడు.
సద్గురు శ్రీ శివానందమూర్తి గారి "మార్గదర్శకులు - మన మహర్షులు" నుంచి