కార్తీకమాసం
సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
ఈ నెల మొత్తం తెల్లవారుజాముల స్నానం చేయాలి.
స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి.
ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.
కార్తీకశుద్ధ ఏకాదశి
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.
కార్తీక దీపాలు
పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు.
దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.
పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.
కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు.
కార్తీక సోమవారాలు - నదీస్నానాలు
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు.
వనభోజనం
కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.