కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే..?
ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి దాని కింద భోజనాలు చేయడం ద్వారా ఆశించిన ఫలాలు చేకూరుతాయి. ఈతిబాధలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే కార్తీక మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, చద్దన్నం, గుమ్మడికాయ, వంకాయ, ముల్లంగి, నువ్వులు, మాంసాన్ని తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఈ మాసంలో పాటించే నియమాలే భగవంతుడి అనుగ్రహం దక్కేలా చేస్తూవుంటాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నదీ స్నానం చేయాలి .. లేదంటే చన్నీటి స్నానం చేయాలి. అంతేగానీ వేడినీటి స్నానం చేయకూడదు.
అలాగే తలకి నూనె పట్టించకూడదనే విషయాన్ని ఈ మాసంలో మరచిపోకూడదు. ఈ మాసమంతా తులసీ దళాలతో శ్రీమహా విష్ణువును, బిల్వ దళాలతో పరమశివుడిని ఆరాధించాలి.
ప్రతిరోజు పూజా మందిరంలోను ... తులసికోట దగ్గర ... ఆలయంలోను దీపాలు వెలిగించాలి. సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళలో శివ కేశవులను పూజించి .. వారికి నైవేద్యంగా సమర్పించిన దానినే ప్రసాదంగా స్వీకరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.