మీ పెన్ డ్రైవ్ లోకి పెద్ద ఫైళ్ళు కాపి అవడంలేదా?
ఈ రోజుల్లో హెచ్ డి వీడియోలు తీయగల కెమేరాలు సరసమైన దరల్లో అందుబాటులో ఉండడం వల్ల అందరి దగ్గరా ఉంటున్నాయి. వీటిలో తీసిన వీడియో పరిమాణం పెద్దదిగా ఉండడం వలన మనం పెన్ డ్రైవ్ లేదా మెమొరి కార్డులలో ఖాళీ ఉన్నప్పటికి ఒకొక్కసారి కాపి కావు. ఒకోసారి కాపి అయినప్పటికి పూర్తిగా కాకపోవడం వల్ల ఆ ఫైలు తెరుచుకోదు. అంతే కాకుండా ఈ మధ్య వచ్చే సినిమాలు కూడా హెచ్ డి లో ఉండి పెద్ద పరిమాణంలో ఉంటున్నాయి. ఒకే ఫైలు 4 జిబి కన్నా ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంటుంది. దీనికి కారణం మన పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టం. సాధారణంగా పెన్ డ్రైవ్ లు fat పైల్ సిస్టంలో ఫార్మాట్ చేయబడిఉంటాయి. ఈ పురాతన ఫైల్ సిస్టం యొక్క పరిమితుల వలన 4 జిబి కన్నా పెద్ద పరిమాణం గల ఫైలు కాపి కాదు. అప్పుడు మనం మన పెన్ డ్రైవ్ ని ఫార్మాట్ చేసుకొనేటప్పుడు ntfs ఫైల్ సిస్టం లో చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 జిబి కన్నా పెద్ద ఫైళ్ళు కూడా పెన్ డ్రైవ్ లోకి కాపి చేసుకోవచ్చు.