పద్మావతీ శ్రీనివాసుల కల్యాణము
ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు గావించుట
ఆకాశరాజు రాజధానియైన నారాయణపుర మంతయూ అతివైభవముగా అలంకరించారు. చలువ పందిళ్ళు వేసి పచ్చల తోరణములు గట్టి, పన్నీరు కలపిన కల్లాపు జల్లించిరి. ముత్యాలమ్రుగ్గులు బెట్టించిరి. పద్మావతీదేవికి అంతఃపుర స్త్రీలు మంగళస్నాములు చేయించి, బంగారు చెరగుల పట్టుపీతాంబరము కట్టించి యేడు వారముల నగలు ధరింపజేసి, శ్రీమహాలక్ష్మి వలె శృంగారించిరి. శ్రీనివాసమూర్తి వచ్చెనను వార్త విని ఆకాశరాజు పద్మావతిదేవిని పట్టపుయేనుగుపై గూర్చుండబెట్టి, మంగళ వాద్యములతో శ్రీనివాసునకు యెదురుగా నేగెను.
ఆకాశరాజు శ్రీనివాసుని గాంచి అనేక విధముల స్తోత్రించి తన కుమారై పద్మావతిని అతనిని పునర్దర్శనము చేయించెను. అంతట పద్మావతీ శ్రీనివాసులను సమస్త మేళతాళములతో ప్రవేశింపజేసి వీధులందు ఉత్సవము చేయించెను. ఆ వుత్సవ సమయమున నగరములో వున్న పుణ్యస్త్రీలు పద్మావతీ శ్రీనివాసులకు హారతులు పట్టి పూజలు పుష్పములు అక్షంతలు వారిపై జల్లి దీవించిరి. వంది మాగధులు కైవారములు చేయుచుండ నృత్యగాన వాద్యములు మ్రోయుచుండ జయజయ శబ్దములు మునులు పలుకచుండ పట్టణమంతయూ వధూవరులను ఊరేగించిరి. అనంతరము శ్రీనివాసుని నొక దివ్యమందిరంలో ప్రవేశపెట్టిరి. మిగతావారందరికి తగిన విధముగా విడుదులు యేర్పరచిరి.
అంత ఆ రాత్రి ఆకాశరాజు అనేకమంది పాకశాస్త్ర ప్రవీణులచేత మంచి మంచి పదార్థములు ఆనేకరకములు చేయించి పెండ్లివారందరికి ఆనందముగా భోజనములు పెట్టించెను. ఆ రాత్రి అందరూ సుఖముగా గడిపిరి. ఆ రాత్రి ఆకాశరాజు వశిష్ఠాది పురోహితులతో కల్యాణమునకు కావలసిన వస్తుసంబారము లన్నియూ అడిగి తెలిసికొని వారు చెప్పినట్లు అన్ని వస్తువులనూ సిద్ధము చేయించెను. ధరణీదేవి చెలికత్తెల నందఱిని చేర్చుకొని చీరెలూ, రవికలు, పూజాద్రవ్యములు పండ్లు, పసుపు కుంకుమలు నగలు మొదలయినవి కళ్యాణమునకు సిద్ధము చేసెను.
పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణము
ముహూర్తము సమీపించుచుండగా ఆకాశరాజు సమస్త బంధువులతో మంగళవాద్యములతో శ్రీనివాసుని విడిది గృహమునకు బోయిరి. అంతట వశిష్ఠ మహాముని ఆకాశరాజుతో "ఆర్యా! మీ దంపతులు వరుని పూజ గావింప వలసినది" అనెను. ఆకాశరాజు దంపతులు శ్రీనివాసునకు చందన తాంబూలములు వస్త్రములు భూషణములు యిచ్చి పుష్పములచే పూజించిరి. శ్రీనివాసుని పట్టపు యేనుగుపై గూర్చుండజేసి, బ్రహ్మాది దేవతలూ, మునులు, పుణ్యాంగనలు, సమస్త వాద్యములతో విడిది గృహమునండి రాజమందిరద్వారము చెంతకు దీసుకొని వచ్చిరి, ద్వారము వద్ద పుణ్యస్త్రీలు శ్రీనివాసునకు నీరాజనమిచ్చిరి.
పిమ్మట కన్నుల పండుగగా వైభవముగా కళకళలాడు కళ్యాణ మంటపమునకు శ్రీనివాసుని గొనిపోయి బంగారు పీటపై గూర్చుండబెట్టిరి. అంతట వశిష్ఠ మహాముని చెప్పగా పవిత్రమగు స్వామి పుష్కరిణి తీర్థము ధరణీదేవి బంగారుకలశములతో పోయుచుండ ఆకాశరాజు, శ్రీనివాసుని పాదములు గడిగి తన శిరస్సునా భార్య శిరస్సునా జల్లుకొనెను.
వశిష్ఠుడు బృహప్సతియూ కల్యాణ మంత్రములు ప్రారంభించిరి. ఆకాశరాజు పద్మవతీదేవి చేతిని పట్టుకొని ధరణిదేవి బంగారు పాత్రలో జలము పోయుచుండ శ్రీనివాసుని చేతిలో ధారపోసెను. వశిష్ఠుడు వధూవరులకు కంకణములు గట్టెను. సుముహూర్త గడియవచ్చెను. వశిష్ఠాదులు మంత్రములు చెప్పుచుండ మంగళవాద్యములు మ్రోగుచుండ ముత్తైదువులు మంగళములు పాడుచుండ శ్రీనివాసమూర్తి పద్మావతీ మెడలో మాంగల్యము కట్టెను. దేవతలు పుష్పవర్షము గురిపించిరి. మహామునులు ఆశీర్వదించిరి. అనంతరము మంచి ముత్యములతో కళ్యాణదంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకొనిరి. పెండ్లివేడుక జరిగిపోయెను.
ఆకాశరాజు శ్రీనివాసునకు పద్మావతిని అప్పగించుట
కళ్యాణ సమయమున ఆకాశరాజు అల్లుడైన శ్రీనివాసునకు కట్నముగా నూరు బారువుల బంగారు కిరీటము, ఒక కోటి బంగారు నిష్కములను, మణులు చెక్కిన కంఠహారములు, మాణిక్య పతకములు, మకర కుండలములు, సింహతలాట కంకణములు, రవ్వల ఉంగరములు, బంగారు మొలత్రాడు, అపరంజి పాదుకలు, బంగారు భోజనపాత్రలు రత్నకంబళములు, వేయి యేనుగులు, పదివేల గుఱ్ఱములు, దాస దాసీజనములు మొదలైన అనేక విధములగు వాటిని నిచ్చెను.
పద్మావతీదేవికి చీని చీనాంబరములు, మణిమయ సువర్ణభూషణములు, దాసీజనమును, నూరు గ్రామములును యిచ్చి గౌరవించెను. వివాహమునకు వచ్చిన శ్రీనివాసుని వైపు వారికిని తనవైపు వారికిని సమస్త మర్యాదలూ చేసెను. బ్రాహ్మణులకు భూరి సంభావనలిచ్చి మృష్టాన్నములు పెట్టించెను. ఈ విధముగా అయిదు రోజులు పెండ్లి మహావైభవముగా జరిగినది.
ఆకాశరాజు, ధరణిదేవియును పాలధారలతో పద్మావతీదేవిని శ్రీనివాసుని చేతిలో నప్పగించి, ఆకాశరాజు శ్రీనివాసునితో యిలా అన్నాడు! "నాయనా! శ్రీనివాసా! నీవు సాక్షాత్తూ భగవానుడవని తెలుసుకున్నాను. నీ పాదములు గడిగి బిడ్డ నిచ్చుటవలన మా వంశమంతా తరించింది. నేను పూర్వజన్మమున యెంతో పుణ్యము చేయుటవల్ల భగవంతుడైన నీవు అల్లుడవైనావు నీవు ధర్మదేవతవు. నీకు తెలియని ధర్మములులేవు. అయిననూ తండ్రి ధర్మమువల్ల నీకొక్క మాట మనవి చేసికొందును. ఏమంధువా? మా పద్మావతి ఏమీ తెలియని బాల. ఆమెను ఎలా ఏలుకొంటావో సుమా! పూర్వము నీ సంగతి తెలియనప్పుడు నిన్ను రాళ్లచే కొట్టించెనన్న సంగతి మనసులో పుంచుకొనక క్షమించుము" అని ప్రార్థించి పద్మావతితో యిలా అన్నాడు. "అమ్మా! నీవు విజ్ఞానవంతురాలవు. నేను చెప్పుమాటలు సావధానముగా విను. నీవు చాలా అదృష్టవంతురాలవు. ఏలనన? భగవానునకు యిల్లాలు వగుటచేత సుమా! స్త్రీకి భర్తయే భగవంతుడు ఎల్లప్పుడు భర్తపాదసేవ మరువకుము. నీ పతిమాటలకు యెన్నడూ యెదురాడకము. పెద్దల సేవ చేయుము ఆశ్రయించినవారిని ఆదరముతో పోషింపుము. పుట్టినింటికి అత్తవారింటికి పేరు ప్రతిష్ఠలు తేవలసినది. అనసూయాది మహాతల్లుల చరిత్రలు జ్ఞప్తికి తెచ్చుకొని ప్రవర్తింపుము. మమ్ము మరువకుము" అని యెన్నియో మంచి వాక్యములు బోధించెను.
పద్మావతిని అత్తగారింటికి ప్రయాణము చేయించిరి. సారెలు నగలతో శ్రీనివాసునితో కూడా ప్రయాణమైరి. శ్రీనివాసమూర్తి ఆత్తమామల సెలవొంది పద్మావతితో గరుడవాహన మొక్కెను. మిగిలిన పెండ్లివారు తమతమ వాహనములనెక్కి ప్రయాణము సాగించిరి.
శ్రీనివాసుడు పద్మావతితో అగస్త్యాశ్రమమున నుండుట
శ్రీనివాసుడు ప్రయాణము సాగించుచూ ఆకాశరాజును జూచి "మామా! నీవు నా కొనర్చినమేలు యెన్నటికినీ మరువను. నీకేమి కావలెనో కోరుకొనుము యిచ్చెదను" అనెను. ఆకాశరాజు యిట్లనెను.
"భగవానుడా! నీ కరుణ వలన నాకు రాజ్యము మొదలైన సమస్త భోగములు వున్నవి. నాకేమి కొరత, అయిననూ నిన్నొకటి కోరెదను. ఏమన? నా మనస్సు సర్వదా నీ నామస్మరణ మరువకుండునట్లు వరమిమ్ము. అంతకంటే నాకేమియూ వద్దు" అని ప్రార్థించెను. శ్రీనివాసుడు సంతసించి "నీకు పరమాత్ముని సాయుజ్యమును ప్రసాదించితి" ననెను. ఆకాశరాజు ఆనందమందెను. శ్రీనివాసుడు వారి సెలవు దీసుకుని సమస్త పరివారముతో ప్రయాణము సాగించి మార్గమధ్యములో అగస్త్యుని ఆశ్రమము చేరిరి. అచ్చట అగస్త్య మహాముని శ్రీనివాసుని భక్తితో పూజించెను. తరువాత శ్రీనివాసమూర్తి బ్రహ్మాదిదేవతలతో యిట్లనెను.
"అయ్యలారా! మీ కొక్క విశేషము చెప్పెదను. వివాహమైన నూతన దంపతులు ఆరునెలల వరకూ యీ అగస్త్యముని ఆశ్రమమందే యుండి అనంతరము శేషాచలమునకు చేరెదను" అని వారినందరినీ పేరు పేరున వరుసగా మర్యాదలు చేసెను. బ్రహ్మ మొదలైన వారందరూ శ్రీనివాసుని ఆజ్ఞ తీసుకుని తమతమ యిండ్లకు చేరిరి. శ్రీనివాసమూర్తి పద్మావతీదేవితో సుఖముగా అగస్త్యముని ఆశ్రమములో నుండెను.
ఆకాశరాజు మోక్షము పొందుట
ఒకనాడు నారాయణ పురమునుండి ఒక సేవకుడు అగస్త్యముని ఆశ్రమమునకు వచ్చి, పద్మావతీ శ్రీనివాసులను జూచి దుఃఖముతో "అయ్యా! మా ప్రభువైన ఆకాశరాజుగారికి అకస్మాత్తుగా జబ్బుచేసింది. వారు చాలా ప్రమాద స్థితిలోవున్నారు. మహారాజుగారు మిమ్ములను చూడవలెనని కోరుచున్నారు. కనుక దయచేయుడు" అనెను.
ఆ మాటలు విని పద్మావతీ శ్రీనివాసులు విచారపడి అగస్త్యమహామునిని తమ వెంటబెట్టుకొని తొందరగా నారాయణపురము జేరిరి. ఆకాశరాజు స్పృహలేక యుండెను. శ్రీనివాసముర్తి దుఃఖముతో మహారాజును పలుకరించెను. గాని ప్రత్యుత్తరము చెప్పుస్థితిలో లేడు. పద్మావతి తల్లియైన ధరణిదేవిని కౌగలించుకొని యేడ్చుచుండెను. ఆ ఆకాశరాజు కొంతసేపటికి కొంచెము కన్నెత్తి చూసెను. కూతురును అల్లుడును కనుపించిరి.
మరణావస్థలో వున్న ఆకాశరాజు యెట్లో ఓపిక తెచ్చుకొని శ్రీనివాసునితో యిట్లనెను. "పరంధామా! జగన్నాధా! వాసుదేవా! గోవిందా! అంత్యకాలములో నిన్ను చూచి నా జన్మ తరించినది. నాకేమీ కోరికలేదు. కాని నిన్నొక్కటి ప్రార్థిస్తాను. నా కుమారుడైన "వసుదాసుడు" నా తమ్ముడైన "తొండమానుడు" యేమి తెలియనివారు వారిద్దరిని కంటికి రెప్పవలె కాపాడుము. నాకదియే పదివేలు" అని జెప్పి కుమారైయైన పద్మావతీదేవిని దగ్గరచేర్చుకొని, "అమ్మా! నీవు లోకమాతవు. నీ వలన నా వంశము తరించినది. నీకునూ నీ తండ్రికిని యీ జన్మతో ఋణము తీరినదని తలంచుము. సుఖముగా వర్దిల్లుము అని పలికి ప్రాణములు విడిచెను. అందరూ గొల్లుమని యేడ్చిరి. ఆకాశరాజునకు దహనసంస్కార మొనర్చిరి. ధరణిదేవి తన భర్తతో సహగమనము చేసెను. తరువాత పద్మావతీ శ్రీనివాసులు మరలా అగస్త్యముని ఆశ్రమము చేరి సుఖముగా నుండిరి.
తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము
పూర్వము ఒకానొకప్పుడు "వైఖానసుడు" అనుభక్తుడు కలడు అతడు కృష్ణావతారమును మిక్కిలి ప్రేమించును. అందువలన కృష్ణభగవానుని ప్రత్యక్షముగా చూడవలెనని కోరిక గలిగి నిద్రాహారములు మానుకుని అఖండ దీక్షతో భగవంతుని గురించి తపస్సు ప్రారంబించెను. ఆ తపస్సు యెన్నియో యేండ్లు జరిగినది. పట్టుదలతో చేయు చుండిన ఆ తపస్సునకు భగవానుడైన శ్రీమహావిష్ణువు సంతసించి అతనికి ప్రత్యక్షమై "భక్తుడా! నీ కేమి కావలెనో కోరుకొమ్మనెను. వైఖానసుడు కన్నులు దేరచి భగవంతుని దివ్యమంగళ విగ్రహమును జూచి మిక్కిలి సంతసించి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామ మొనరించి యిట్లు ప్రార్థించెను.
మహానుభావా! కరుణాసముద్రా! దేవదేవా! నాకు యితరమైన కోరికలు లేవు. కాని నీ కృష్ణావతారమును కన్నులారా చూచి పూజించవలెనని మాత్రము వాంఛ వున్నది. నాకు ఆ భాగ్యము ప్రసాదింపుము" మనెను. శ్రీహరి "నాయనా! నీవిప్పుడు కృష్ణరూపమును చూడజాలవు. కాని యిప్పుడు శేషాద్రియందు కృష్ణుడే శ్రీనివాసరూపముతో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతని పూజింపుము" అని చెప్పి విష్ణుమూర్తి అంతర్థాన మయ్యెను.
వైఖానస ఋషి సంతోషించి, అక్కడినుండి శేషాద్రికి ప్రయాణమై పోవుచుండెను. మార్గమధ్యమున "రంగదాసు అను భక్తుడు వైఖానసుని కలిసి "స్వామీ! తామెక్కడికి పోవుచున్నారనెను. వైఖానసుడు వానితో "నాయనా! నేను శేషాద్రియందున్న శ్రీనివాసుని సేవించుటకు పోవుచున్నాను అనెను. ఆ మాటవిని రంగదాసు "మహానుభావా! నేనునూ స్వామి సేవకు వచ్చెదను పూజయందు మీకు సహాయముగా నుందును నన్నునూ తీసుకొనిపోవలసిన" దని కోరెను. వైఖానసుడు సంతిసంచి అట్లే రమ్మనెను. వారిద్దఱూ కలిసి శేషాద్రిపర్వతమునకు ప్రయాణము సాగించి కొండపైకెక్కిరి.
వైఖానసముని పుట్టవద్దకు చేరియందున్న భగవానుని పూజింపనెంచి రంగదాసుతో " ఓయీ! స్వామిని పూలతో పూజించిన చాలా సంతోషించి తొందరగా ముక్తినిచ్చును. గనుక నీవు ఒక పూలతోట పెంచి స్వామి పూజకు పూలు యిచ్చుచుండు" మనెను.
రంగదాసు సంతోషించి పూలతోటను పెంచుటకు నీరు ముఖ్యముగాన అందులకై ఒక భావిని త్రవ్వించెను. దానికే "పూలబావి" అని పేరు. రంగదాసు పూలతోటనాటి ఆ బావిలో నీరుతోడి పోయుచూ వనమును పెంచి అందలి పూలుప్రతిదినమూ స్వామిపూజకు వైఖానసమునికి యిచ్చుచుండెను.
ఇట్లుండ ఒకనాడు ఒక గంధర్వరాజు తన భార్యలతో పుష్కరిణిలో జలక్రిడలాడుచుండెను. పువ్వులకొరకు వచ్చిన రంగదాసు వారి క్రీడలు జూచుచు తానునూ చిత్తచాంచల్యముతో అట్లే వుండిపోయెను. స్వామిపూజకు వేళమించు చుండెనని కూడా గుర్తింపకుండెను. తరువాత ఆ గంధర్వులు వెళ్ళిన యనంతరము తెలివివచ్చి పూలు కోసుకొని బిరబిర వైఖానసముని వద్దకు వచ్చెను. ముని వాని ఆలస్యమునకు కారణమేమన, రంగదాసు జరిగిన వృత్తాంతము నెరింగించి తాను పూజకు ఆలస్యము చేసినందుకు భగవంతుని అనేక విధముల ప్రార్థించెను. అంతట శ్రీనివాసమూర్తి ప్రత్యక్షమై "రంగదాసుడా! విచారింపకుము. నీవు నా మాయా మోహముచే గంధర్వుల సుఖములపై భ్రాంతి జెందితిని. నీవు యీ శరీరము విడిచి నారాయణపురమున సుధర్మరాజునకు కుమారుడవై "తొండమానుడు" అను పేరుతో రాజ్యసుఖములను అనుభవింపుము" అని చెప్పెను. ఆ రంగదాసుడే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడై పుట్టెను.