ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUMATHI SATAKAM POEM AND ITS MEANING


సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!
.
(సుమతీ శతకం)
.
భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.
జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.