The Power of Yoga - యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు.
యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం...
ఉదయం పూట మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అన్పించినప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి.
లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాలు తర్వాత యోగాను మొదలుపెట్టాలి.
ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగావల్ల డప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ నీరసించకూడదు.
యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా శ్వాస పీల్చుకోవడం మంచిది. శ్వాస పీల్చుకునేటప్పుడు నోరు మూసుకునే ఉండటం మంచిది.
ఆసనాలు వేయమన్నారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. ఉదయం లేవగానే నిరాహారంగానే ఆసనాలు వేయటం, యోగసాధన చేయటం శ్రేష్టం. అలాగే మధ్యాహ్నం భోజనానంతరం మూడు, నాలుగు గంటలు ఆగి ఆసనాలు వేయవచ్చు. పాలు మొదలగు పానీయాలు సేవిస్తే ఆతరువాత అరగంట ఆగి ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.
ఏ మనిషైనా తన తీరికను బట్టి తన పనులు, అవసరాలను బట్టి ఆసనాలు వేయటానికి, యోగసాధన చేయటానికి సమయం నిర్ణయిచుకోవాలి. అంతేకాని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఆసనాలు వేయాలని కానీ, యోగసాధన చేయాలని గాని నియమం లేదు. అవకాశాన్నిబట్టి ఇవి చూసుకోవాలి. ఆరోగ్యాన్ని అనుసరించి రోజుకు రెండు మూడు సార్లైనా ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.
ఎప్పుడైనా సరే ఆసనాలు వేసినా, యోగసాధన చేసినా నేల మీద మాత్రమే చేయాలి. అంతేకాని పరుపులు, దిండ్లు మొదలైన మెత్తని ఆసనాలు వేసుకొని చేయకూడదు. ఒకే గదిలో ఆసనాలో, యోగసాధనలో చేస్తూ ఉంటారనుకోండి. అలాంటప్పుడు ఆగది పరిశుభ్రంగా ఉండాలి. తుమ్ములు, దగ్గులు, పిల్లలగోల, మనుషుల అరుపులు మొదలైనవి ఉండకూడదు. వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలి. మనస్సుకు ఏకాగ్రత ఎంతైనా అవసరం. మరీ అంతగా ఇబ్బందిగా ఉంటే ఆసనాలు వేసేచోట, లేదా యోగసాధన చేసే ప్రదేశంలో నేల మీద ఉన్ని రగ్గులుకానీ, నాలుగు మడతలు వేసిన నూలు వస్త్రంకానీ పరుచుకొని సాధన చేయవచ్చు. దీనిని బట్టి నేల మీద కూడా ఆసనాలు వేయకూడదని తెలుస్తోంది. గాలి, వెలుతురు ధారాళంగా గదిలోనికి వచ్చేటట్లు చూసుకోవాలి. ఆరుబయట ప్రదేశంలోనూ, మేడ, డాబాలపైనా ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.