ఈనాటి సినిమాల గురించి భానుమతి గారి అభిప్రాయం
నేటి సినిమాల్లో కథా గమనం తీరు మారిపోతోందని, కథానాయకుడు, కథానాయికల పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీసేలా పాత్రలను రూపొందిస్తున్నారని సీనియర్ నటీమణి, బహుముఖ ప్రజ్ఞావంతురాలైన భానుమతీ రామకృష్ణ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
మేలిమి బంగారం లాంటి నాటి సినిమాల్లో అల్లరి మూకల నుంచి తనను కాపాడిన వాడికి హీరోయిన్ మనసిచ్చి ప్రేమించేదని, నేటి సినిమాల్లో ప్రతినాయకుడిలా ప్రవర్తించే హీరోనే కథానాయిక ప్రేమిస్తున్నట్లు చూపించడం వైపరీత్యమేనని ఆమె అనేవారు.
సినిమా పరిశ్రమలో కాలూనిన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ చెన్నై నగరాన్నే తన శాశ్వత చిరునామాగా చేసుకున్న డాక్టర్ భానుమతి ఏ తెలుగు లేదా తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేటి సినిమాల్లోని ఇలాంటి విపరీత ధోరణులను ఖండించేవారు.
అంతేగాక తాను రాసిన తన స్వీయ చరిత్రలో సైతం ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆమె ఈ వ్యాసకర్తకు స్వయంగా చెప్పారు. నాటి సినిమాల్లో విలన్ లక్షణాలు కథకు తగ్గట్టుగా ఉండేవని, నేటి చిత్రాల్లో విలన్ అంటే నరరూప రాక్షసుడిగానే చూపిస్తూ ఆ పాత్ర చేత భయానకమైన పనులు చేయిస్తూ జుగుప్సాకరమైన రీతిలో సినిమా చిత్రీకరణ జరుగుతోందని భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదాహరణకు హీరోయిన్ అత్యాచారానికి గురయ్యే సన్నివేశం ఉంటే, నాటి చిత్రాల్లో పూర్తిగా దృశ్యాన్ని చూపకుండా విలన్ కేవలం కథానాయిక చెంతకు రావడాన్ని మాత్రం చూపించి, మిగతా భాగంలో విషాద సంకేతాలను మాత్రం చూపేవారని ఆమె తెలియజేస్తూ...
ఇప్పటి సినిమాల్లో విలన్ హీరోయిన్ దుస్తుల్ని తొలగిస్తూ, ఆమెను వెంటాడుతూ మొత్తం అత్యాచార దృశ్యాన్ని చూపిస్తే చిత్రాన్ని చూసే యువత పెడదారి పట్టక ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు.
ఇక శృంగార సన్నివేశాలు మరీ దారుణమంటారు డాక్టర్ భానుమతి. తాను చిత్రసీమకు వచ్చిన రోజుల్లో కథానాయకుడు, కథానాయికల మధ్య ప్రేమ సన్నివేశమనేది ఇద్దరూ సిగ్గుపడటం, కంటి చూపులతో దూరం నుంచే పలుకరించుకోవడం వంటి వాటితో సహజంగా చిత్రీకరణ జరిగేదన్నారు.
మరి ఇప్పటి పరిస్థితులు చూస్తే... ఒక కుటుంబం పిల్లలతో సహా సినిమాకు వస్తే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు వచ్చేసరికి పిల్లలతో ఎందుకీ సినిమాకు వచ్చామా అని పెద్దలు సిగ్గుతో తలదించుకొనే రీతిలో ఉన్నాయని ఆమె అన్నారు.
తన జీవితాన్ని టీవీ సీరియల్‌గానూ (తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ ధారావాహికలో వ్యాసకర్త నటించారు) రూపొందించిన డాక్టర్ భానుమతి ఈ అంశాలన్నింటినీ అందులో ప్రస్తావించారు.
మొత్తం మీద సినిమాకు సంబంధించి నటనా ప్రతిభ, కథాబలం వంటి పదాలకు కాలం చెల్లిపోయిందని డాక్టర్ భానుమతి పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడం పట్ల ఆవేదన, మంచి రోజులు మళ్లీ వస్తాయన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.