సొగసైన పాదాలకు
కాళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి... మొదట గోళ్లను కత్తిరించుకోవడంతో ప్రారంభించండి. కాలి గోళ్లకు చక్కని ఆకృతినివ్వడం మరిచిపోవద్దు. ఇలా ప్రతి పదిహేను రోజులకోసారి చేసినా సరిపోతుంది. దీనివల్ల కాళ్లు శుభ్రంగా ఉండటమే కాదు, గోళ్లలో పేరుకునే మురికి దూరమవుతుంది. ఎప్పుడూ నెయిల్‌పాలిష్ వేసుకుని ఉండటం కొందరు ఫ్యాషన్‌గా భావిస్తే, మరికొందరు కనీసం సగం మిగిలిపోయిన రంగుని కూడా తొలగించరు. దీనివల్ల గోళ్లపై ఉండే సహజ నూనెలు పోతాయి. అవి పొడిబారడం, చిట్లిపోవడం, రంగు మారడం జరుగుతుంది. వారంలో ఒకట్రెండు రోజులైనా గోళ్ల రంగు లేకుండా చూసుకోండి. గోరువెచ్చని బాదం నూనెతో గోళ్లకు మర్దన చేస్తే వాటికి కావలసిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఎదుగుతాయి.
గోళ్ల రంగును ఆరేవరకూ ఉంచుకోవడం కష్టమనుకుని బ్లో డ్రయర్‌ని వాడతారు కొందరమ్మాయిలు. దీనివల్ల గోళ్లు పొడిబారిపోతాయి. వీలైనంత వరకూ సహజంగా ఆరేట్లు చూసుకోవడమే మంచిది. తరచూ నెయిల్‌పాలిష్ ఉపయోగించేవారు, ఎక్కువగా రిమూవర్‌ని వాడతారు. దానిలో ఉండే కఠిన రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నేరుగా ఎసిటోన్‌ను రంగు తొలగించడానికి ఉపయోగించొద్దు. వీలైనంత వరకూ ఎసిటోన్ లేని రిమూవర్ వాడటం మంచిది.