ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRIVIDHYA RAHASYAMULU - DEVOTIONAL TELUGU BHAKTHI ARTICLE


శ్రీవిద్యా రహస్యములు

ఆది తత్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన. అది లలితా పర్యాయము, చండి పర్యాయము అని రెండు విధములు.

రెంటికి శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచాదశాక్షర మూల మంత్రముతో కూడినది. రెండవది నవాక్షర మంత్రముతో కూడినది.

ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలబ్యము కలదు. తల్లి పిల్లల తప్పులను ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. తండ్రి కోపబడినా, తల్లి అంత తొందరగా కోపబడదు. లోకం లో దుర్మార్గుడు అయిన బిడ్డ వుంటాడు గానీ, తల్లి వుండదు.

జగన్మాత ఉపాసన మాతృ సేవన వంటిది. ఆమెను సేవించడము అత్యంత సులభము.

శ్రీ చక్ర సంచారిణి ఐన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ, చరాచర సృష్టికి మూల కారణమయ్, అంతట వ్యాపించి, సర్వ ప్రాణులలో "శక్తి" స్వరూపం లో ఛిచ్చక్తి అయి , పరబ్రహ్మ స్వరూపం అయి ప్రకాశిస్తూ వున్నది. సకల ప్రాణులకూ తల్లి అయి " శ్రీమాతగా" పిలువబడు చున్నది.

అందుకే ఆమెను " ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ" ..... అని పోతనామాత్యులు అన్నారు.

పరమేశ్వరుని యందె అంతర్లీనమై , రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, శ్రీచక్రము నందలి బిందు స్థానమై, పరాశక్తి అయి, శ్రీ లలిత గా సంభోదించ బడుచున్నది.

యోగ మాయ బలానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కట్టుబడి ఉండేవారే. యోగ మాయ కు అందరు తలలు ఒగ్గ వలసిన వారె. మాయ అంతర్ముఖ, బహిర్ముఖ బేధముతో
రెండు విధములగా వుంటుంది. ఈ మాయ వలెనే త్రిగుణాలు ఏర్పడినాయ్. అగ్ని మండడం, గాలి వీచడం, సూర్యుడు ఉదయించుట ఇవన్ని ఆమె వలెనే జరుగుతూ ఉంటాయ్.

ఆమె శక్తి గనుక లేక పొతే వాళ్ళకు గుణాలు వుండవు, పేర్లు మాత్రమే మిగులుతాయ్. ఆత్మను ఆశ్రయించిన మాయకే విద్య అని పేరు. ఇది ఒక ఆవరణ, దీనిని తొలిగిస్తే,
నిత్యమూ, సత్యమూ ఐన ఆ తల్లి రూపం కనిపిస్తుంది. ఇచ్ఛ, జ్ఞానము, క్రియ అనే మూడు శక్తులు ఆమెను ఆశ్రయించి వుంటాయి.

మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ రూపమైన ఆ శ్రీమాతను , ఆ పరదేవతను ఆరాధించి కొలవడమే శ్రీవిద్యోపాసన.

త్రిమూర్తులను, త్రిశక్తులను సృష్టించిన శ్రీమాత ఆమె. సర్వ సృష్టికి మూలాధారమైన ఆ ఆది శక్తి మన తల్లి.

ఒకప్పుడు ఆమెను దేవతలందరూ "అమ్మా నీవు ఎవరు? అని అడుగగా
" నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వలెనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది".... అని పలికినది.

అందుకే ఆమె "బ్రహ్మ విష్ణు శివాత్మిక" అని శివ శక్తి ఐక్య రూపిణీ లలితాంబిక ..... అని పిలవబడుచున్నది.

శ్రీ వాగ్దేవీం మహా కాళీం, మహా లక్ష్మీం, సరస్వతీం,
త్రిశక్తి రూపిణీం అంబాం, దుర్గాం, చండీం నమామ్యహం.