ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS TRAYODASI PUJA VRATHAM - HOW TO PERFORM TRAYODASI VRATHAM - STEP BY STEP INFORMATION FOR PERFORMING TRAYODASI VRATHA PUJA VIDHANAM


త్రయోదశి వ్రతం ఎందుకు చేస్తారు?

త్రయోదశి వ్రతాన్ని ‘‘ప్రదోష వ్రతం’’ అని కూడా అంటారు. ఈవ్రతాన్ని ఎటువంటి హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఆచరించవచ్చు. ఈ వ్రతం చాలా సులువుగానే చేయవచ్చు. దీనికి ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇది కొన్ని కాలాలపాటు చేయాల్సిన సుదీర్ఘవ్రతం. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) ఈ వ్రతం తప్పకుండా చేయాలి. అలా 11 సంవత్సరాలపాటు దీన్ని ఆచరించాల్సి వుంటుంది. మధ్యలో ఏమైనా సమస్య తలెత్తి ఈ వ్రతం చేయలేకపోతే.. ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.
ఇంతకీ త్రయోదశి వ్రతం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా చేస్తారన్న మొదలైన విషయాలు తెలుసుకుందాం...
త్రయోదశినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కనుక దీనికి త్రయోదశి వ్రతం అని అంటారు. శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ఈ వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. త్రయోదశి వ్రతం విధివిధాలుగా చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా తమకు అధికారం లేదా హోదా కావాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వంటివాటికి కొదవ ఉండదు. అన్ని పూజలు, వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు. సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ఈ పూజను నిర్వహిస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుందని భావిస్తారు.
సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేసుకోవాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కులలో ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి. ఒకవేళ ఈ రెండూ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని ''శూలపాణయే నమః'' అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్టించాలి. శుద్ధోదకం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతి దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని ''మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే'' అని సంకల్పం చెప్పుకోవాలి.
గంధము, సుమాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి.
''పినాకపాణయే నమః'' అంటూ ఆవాహన చేయాలి.
''శివాయనమః'' అంటూ అభిషేకం చేయాలి.
''పశుపతయే నమః'' అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీపవైవేద్యాలు సమర్పించాలి.
''జయ నాథ కృపా సింధో జయ భక్తార్తి భంజన
జయ దుస్తర సంసార సాగరోత్తారణ ప్రభో ప్రసీద
సే మహా భాగా సంసారర్తస్య ఖద్యతః
సర్వ పాపక్షయం కృత్వా రక్షమాం పరమేశ్వర''
అనే శ్లోకాన్ని భక్తిగా జపిస్తూ శివుని ప్రార్ధించాలి.
''మహాదేవాయ నమః'' అంటూ పూజించిన మూర్తిని వదిలేయాలి.