శ్లో|| యే నా నుష్ఠిత మాత్రేణ నరో న నరకం వ్రజేత్ |
సా దేవీ భవ పాథోధేః ఉద్ధర్త్రీ పూజితా నృణామ్ ||
దేవీ ఆరాధన, దేవీపూజ ఒక్కటే సర్వపాప పరిహారకమై, నరకాన్నుంచి రక్షిస్తుంది.
దేవీపూజ - నైవేద్య ఫలితాలు
నారదా! ఇప్పుడు వివిధ వారాలలో చేసే దేవీ పూజకూ - అట్లే ఆ అమ్మవారికి చేసే నైవేద్యాలకూ కలిగే ఫలితాలు చెప్తున్నాను. శ్రద్ధగా ఆలకించు! ఆదివారం పాలు, సోమవారం పాయసం, మంగళవారం కదళీ ఫలం, బుధవారం వెన్న, గురువారం పటిక బెల్లం, శుక్రవారం శర్కర, శనివారం ఆవునెయ్యి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇవి విశేష ఫలప్రదం. నివేదన చేయదగిన ఇతర వ్యంజనాలలో బెల్లం; తేనె; పెరుగు; ఉండ్రాళ్లు; దోస, గుమ్మడి, పనస, మామిడి ఇత్యాది ఫలాలు; లడ్డు, కజ్జికాయలు, చల్ల బూరెలు వంటిపిండివంటలూ ఉన్నాయి.
మధూక పూజ అని ఇంకొక విధానం కూడా ఉంది. అంటే 'విప్పచెట్టు' క్రింద పూజించడం. చైత్రశుద్ధ తదియ మొదలు, ప్రతి మాసంలోనూ వచ్చే తదియ రోజున ఒక్కొక్కనామధేయంతో అలరారే అమ్మవారిని విప్పచెట్టుక్రింద షోడషోపచార పూజతో అర్చించడం. అసలు - ఆ అమ్మవారే కల్పవృక్షం కనుక ఇలా పూజించిన వారికి అలా కోరింది కోరినట్టు లభించడం ఖాయం!
ఈ 12 తదియలకూ అమ్మవారికి ఉండే 12 నామాలూ ఇవి:
శ్లో|| మంగళా వైష్ణవీ మాయా కాళరాత్రిర్దు రత్యయా|
మహామాయా మాతంగీ చ కాళీ కమల వాసినీ ||
శివా సహస్ర చరణా సర్వమంగళ రూపిణీ |
ఏ భిర్నామపదైర్దేవీం మధూకే పరిపూజయేత్ ||
ఈ నామాలకున్న విశిష్టత రీత్యా నైవేద్యాలు ఇవీ: చైత్రశుద్ధ తృతీయ నాడు పంచఖాద్యాలు, వైశాఖ శుద్ధ తృతీయకు గుడం (బెల్లం), ఆపైన వరుసగా ప్రతినెలలో తృతీయకు తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, పేరిన నెయ్యి, ధధికూర్చి, ఆవునెయ్యి, కొబ్బరి...నివేదనలు.
విధి విధానంగా అర్చించాక, మధూకస్థమైన జగదంబను వ్రతపరిపూర్ణ సిద్ధికై భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాలి.
నమః పుష్కర నేత్రాయై జగద్ధాత్రే నమో స్తుతే |
మహేశ్వర్యై మహాదేవ్యై మహా మంగళ మూర్తయే ||
యమలోకా భావ కర్త్రీ యమపూజ్యా యమాగ్రజా |
యమ నిగ్రహ రూపాచ యజనీయే నమోనమః ||
కంకాళ కౄరా కామాక్షీ మీనాక్షీ మర్మ భేదినీ |
మాధుర్య రూపశీలాచ మధుర స్వర పూజితా ||
దుగ్ధవల్లీ నివాసార్హే దయనీయే దయాధికే |
దాక్షిణ్య కరుణా రూపే జయ సర్వజ్ఞ వల్లభే ||
(8-24-46 నుండి 55 వరకు)
ఈ స్తోత్రం కూడా పఠించి, అంబను అర్చించడం ద్వారా సర్వపాపాల్నుంచీ విముక్తులవుతారు. కలలోనైనా యమలోక భయం కలగదు. వంశ పరం పరాభివృద్ధి దాయకం. సర్వ మంగళ కారకం. ఇదంతా నరకం నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోడానికి అన్ని విధాలా అనుకూలమయిన మార్గం! ఇక్కడ చెప్పిన 12 నామాలూ కాక, ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి అయిదు రూపాలున్నాయి. నామ, రూప రీత్యా అవి జగదానంద సంధాయకాలు. వాటి అర్చా - స్వరూపా - మాహాత్మ్యాలను వివరిస్తాను. ముక్తిప్రదంగానూ - కుతూహల దాయకంగానూ ఉంటాయవి అని కొద్దిసేపు విరామం ఇచ్చాడు - నారాయణ ఋషి.