రక్తహీనతకు విరుగుడు బెల్లం
వంటలలోనే కాక, విడిగా కూడా బెల్లంను తినడం ఎంతో మంచిది. బెల్లంలో ఆరోగ్య కరమైన పోషకాలు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి పొటాషియం, కాల్షియం,ఐరన్ ఎక్కువగా ఉన్న బెల్లం మన దేశంలోనే కాక, అనేక ఆసియా దేశాలలో కూడా ప్రాచుర్యంలో ఉంది. మరి ఇన్ని సుగుణాలున్న బెల్లం విశిష్టతను తెలుసుకుందామా.
దసరా, దీపావళి,సంక్రాంతి, రంజాన్ ఇలా ప్రతి పండుగ సమయంలో పిండి వంటకాల తయారీలో బెల్లంను ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా అరిసెలు, బెల్లం పొంగలి, బొబ్బట్లు ఇలా నోరూరించే పదార్ధాలన్ని బెల్లంతోనే తయారు చేస్తారు. చిన్న బెల్లం ముక్క, కొన్ని వేయించిన వేరుశనగపప్పులు సాయంత్రం పూట తినే పాతతరం వారిని మన గ్రామీణప్రాంతాలలో ఇప్పటికీ ఉంది. నేటి తరం వారు కూడా దీనిని ఆచరించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తక్షణ శక్తినిచ్చి శారీరక నిరసాన్ని తగ్గిస్తుంది. అంతేకాక అందరం తాగే టీలో చెంచా పంచదారకు బదులు చెంచా బెల్లం పౌడర్‌ను వేసుకుని తాగితే రుచితో పాటు ఆరోగ్యం కూడా.
బెల్లం ఒక పోషకాల గని. రక్తపోటును తగ్గించడానికి, మూత్రపిండాలలో వచ్చే రాళ్ళ సమస్యను తగ్గించడానికి కావాలసిన పొటాషియం నిల్వలు బెల్లంలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక ఒత్తిడిని తగ్గించి మనస్థితిని మార్చడానికి, మంచిగా నిద్ర పట్టడానికి బెల్లంలోని పొటాషియం ఎంతో ఉపయోగకరం. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి ఉపయోగపడే కాల్షియం పుష్కలంగా ఉన్న పదార్ధం బెల్లం. రక్తహీనతతో బాధపడేవారు చెక్కరకు బదులు బెల్లంను ఉపయోగించడం వలన రక్తవృద్ధికి తోడ్పడుతుందని అనేక ఆధ్యయనాలు కూడా రుజువుచేశాయి ఎందుకంటే కొత్త రక్తం తయారవడానికి కావలసిన ఐరన్ బెల్లంలో అత్యధికంగా ఉండటమే.మీ రోజువారీ డైట్‌లో బెల్లం కూడా చేర్చుకోండి.