కునుకు తగ్గితే మునక!
ఒకప్పుడు ఎంత తక్కువ నిద్రపోతే అంత ఘనం! ఫలానా మహాత్ముడురోజుకు నాలుగు గంటలే నిద్రపోయేవాడని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఆధునిక వైద్య పరిశోధనా రంగం నిద్రను ఏమాత్రం తక్కువగా అంచనా వెయ్యటానికి లేదనీ, ప్రతి రోజూ తగినంత నిద్రపోకపోతే జీవితం వ్యాధుల పరం కావటం తథ్యమని స్పష్టంగా హెచ్చరిస్తోంది. నిద్ర ఎంత తక్కువపోతే ఏమవుతుందో చూద్దామని దోహాలోని వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ పరిశోధకులు అధ్యయనాలు చేశారు. రోజూ ఒక అరగంట తక్కువ నిద్రపోవటం వల్ల వారి ఒంట్లో జీవక్రియలన్నీ అస్తవ్యస్తమై, బరువు పెరగటంతో పాటు చాలామంది మధుమేహం బారిన కూడా పడుతున్నారని వీరు గుర్తించటం ఆందోళనకరమైన అంశం. అలాగే వారమంతా తక్కువ నిద్రపోయి, దాన్ని భర్తీ చేసుకోవటానికి వారాంతంలో ఎక్కువ నిద్రపోవటం కూడా రుగ్మతలు తెచ్చిపెట్టే అలవాటేనని వీరు గుర్తించారు. అరగంట నిద్ర కొరత ఏర్పడినా ఫలితాలు ప్రతికూలంగానే ఉంటున్నాయని వీరు గుర్తించటం చెప్పుకోవాల్సిన అంశం.