ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PURANA MAHABHARATHA STORY ABOUT THE LEDGENDARY FIGHTER - JAMBHAVANTHUDU - THE WARRIOR FIGHTER - BEAR PRINCE


 జాంబవంతుడు

జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.

రామాయణంలో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందర కాండ, యుద్ధకాండలలో తరచు వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.

యుద్ధకాండలో సారణుడనే రాక్షస చారుడు రావణునికి జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి శిఖరం మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు - మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు.

అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.