ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

OMKARAM - THE MEANING OF HINDU ANCIENT MANTRAM - OM


ఓంకారం అంటే ?

మంత్రం అర్థం తెలియక అనుసంధానం చేసుకున్నా ఉపయోగకరమే, అయితే మంత్ర అర్థం తెలిసి చేసుకుంటే ఎంతో ఉపయోగ దాయకం. మనకు ఏర్పడే మానసిక చికాకులని తొలగిస్తుంది. లోకంలో మనకు కర్మ వల్ల వచ్చేవి వస్తూనే ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయరు. వచ్చే వాటిని ఎట్లా గ్రహించాలో తెలియక పోవడంచేత ఎన్నో విచారాలు చేస్తుంటాం. మన మానసిక స్థితిని బట్టి ఆనందం, దుఖం అనేవి తప్ప ఉన్నవాటితో లేక లేనివాటితో కాదు. మనల్ని గొప్ప ఆనంద స్థితిలో ఉంచగలిగే మహా మంత్రం అష్టాక్షరి. మంత్రాన్ని అనుసందించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, కానీ దాని అర్థాన్ని మనం తెలుసుకుంటే దాన్ని ఎల్లప్పటికీ స్మరించుకోవచ్చు, అందుకు నియమం లేదు. అట్లా అర్థానుసంధానం చేసుకోవడానికి పిళ్ళై లోకాచార్య స్వామివారు మనకు ఎన్నో సూత్రాల ద్వారా అందించారు.

మంత్రములలో శిరోభూషణంగా వేదములు, ఋషులు అంగీకరించింది నారాయణ అష్టాక్షరి, ఇది తెలియవల్సిన అర్థాలనన్నింటిని స్పష్టంగా తెలుపుతుంది. అన్ని గ్రంథాల్లో మనకు తెలియాల్సిన విషయాలు అక్కడక్కడా చెదిరి ఉంటాయి, వాటినన్నింటినీ ఒక చోట చేర్చి చూపేది నారాయణ అష్టాక్షరీ మహా మంత్రం. ఇది ముఖ్యంగా మూడు విషయాలను అందులో ఉన్న పదముల ద్వారా తెలియజేస్తుంది. ఈ మంత్రం ఎనిమిది అక్షరములు లేక మూడు పదములు కలిగి ఉంటుంది. ఈ మంత్రం ఆవిర్భవించే సమయంలోనే ఎనిమిది అక్షరాలతో ఆవిర్భవించింది. అందులో ఉన్నవి ఓం ఒక పదం, నమో ఒక పదం మరియూ నారాయణాయ అనేది మరొక పదం. ఇలా మూడు పదాల క్రింద విడదీస్తే మొదటి పదం మన స్వరూపం ఏమిటి అనేది చెబుతుంది. రెండో పదం మనం ఏమిచేయాలో చెబుతుంది, ఉపాయం అని అంటారు. మూడోది ఉపాయాన్ని పట్టుకొని పొందాల్సింది ఏమిటి అని చెబుతుంది, దీన్నే ప్రాప్యం లేక ఉపేయం అని అంటాం. ఇలా మూడు పదాలుగా విడదీసి చెప్పుకోవడం అందులో కల ఒక అందం. అట్లా కాక రెండు పదాలుగా విడదీసి అంటే, 'ఓం నమో' అని ఒక పదంగా, 'నారాయణాయ' అని రెండో పదంగా విడదీసి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి పదం మనం ఏమాత్రం తనంతట తానుగా ప్రవర్తించగలిగినది మన స్వరూపం కాదు అని చెబుతుంది. కేవలం వెనకాతల నడిపించే వాడిపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే పరతంత్రత అని అంటారు. అంటే మన స్వరూపం పరతంత్రతను కలిగినది, కనుక మనం చేయదగినది వాడిముఖ వికాసం కలిగించే సేవ, దీన్నే కైంకర్యం అని అంటారు. ఇలా ఇదొకరకంగా చెప్పుకొనే విధానం.

ఓం అనే పదాన్ని తీసుకుంటే, ఇది ఒక పదమా ? లేక అక్షరమా ? లేక వాక్యమా ? భాషలో అచ్చులు, హల్లులు కలిసి ఉంటాయి. కొన్ని హల్లులు అచ్చులు కలిసి అర్థాన్ని ఇవ్వగలిగితే పదం అని అంటాం. 'గోవు' ఇది కొన్ని అక్షరాల కలయిక,ఆ కలయిక ద్వారా ఒక అర్థాన్ని ఇవ్వగల శక్తి దానిలో ఏర్పడింది, కనుక పదం అని అంటాం. అలానే కొన్ని పదములు కలిసి మన సంశయాలను తీర్చగలిగినట్లుగా అర్థం ఇవ్వగలిగితే దాన్ని వాక్యం అని అంటాం. 'గోవు పాలు ఇచ్చును' ఇలా కొన్ని వాక్యాలు కలిసి మనకు గోవు ఏమి చేస్తుంది అనే సంశయాన్ని తీర్చి, ఒక అర్థాన్ని ఇస్తుంది కనక అది ఒక వాక్యం అని అంటాం. 'ఓం' అనేది అక్షరమా ? 'ఓం ఇత్యేకాక్షరం' అంటుంది వేదం. అంటే ఓం అనేది ఒక అక్షరం. భగవద్గీతలో భగవానుడు 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ్ అనుస్మరన్' అని చెబుతాడు. ఓం అనేది ఒక అక్షరం, ఇది బ్రహ్మ, ఇది వేదం. ఏం చెబుతుంది అది ? 'మామ్ అనుస్మరన్' నన్ను తలవాలి అని చెప్పాడు. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వ గలదు కనక దీన్ని ఒక పదం అని కూడా అనవచ్చు. ఇది కొన్ని అక్షరముల కూర్పు కూడా. అవి 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు. ఈ మూడు అక్షరాలు కలిసి ఒక పదం అయ్యింది. మామూలుగా కొన్ని అక్షరాలు కలిసి పదం అయ్యి ఒక అర్థాన్ని ఇస్తాయి, కానీ ఒక్కో అక్షరాన్ని విడదీస్తే ఏమి అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి విడి విడి అర్థాన్ని ఇవ్వగలవు. అట్లా అకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, ఉకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, మకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు. కనుక ఇవి మూడు పదాలు అని కూడా చెప్పవచ్చు. ఇలా మూడు పదాలు కలిసిన ఓంకారం ఒక స్వతంత్ర అర్థాన్ని ఇవ్వగలదు, మన సంశయాలను తీర్చగలదు కనక వాక్యం అని చెప్పవచ్చు. అందుకే ఓంకారాన్ని ఒక అక్షరం అని చెప్పవచ్చు, ఒక పదం అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యం అని చెప్పవచ్చు. ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి, పదంగా ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి అట్లా వాక్యంగా కలిసి ఏం అర్థాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాలి.