ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU MORAL KIDS STORY - CASH FOR CASH AND CASH FOR ALL


చందమామ కధ... డబ్బుకు లోకం దాసోహం.!

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.

అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ. 'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా. ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా. ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌. అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.