భీముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞలు.!
పాతదైనా కొత్తగా తోచడం, సౌందర్యానికి లక్షణం. ఈ సౌందర్యం నన్నయగారి శబ్దరచనలోనూ, అర్థరచనలోనూ, మనం దర్శించవచ్చు. విశేషమేమిటంటే శబ్దార్థ సౌందర్యాలు రెండూ అవినాభావంతో ఆయన రచనలో కానవస్తాయి. అందుకే ఆయన భారతం అందరి ఆదరాన్ని అందుకున్నది; అందుకుంటున్నది. ఆ అంశాన్ని ఇక్కడ కొద్దిగా పరిశీలిద్దాం.
మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర
ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"
తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను.
ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"
తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను.
ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు. ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి. అంతమాత్రమే కాదు. కొంత ఇంచుమించుగానైనా ఈ ఘట్టంలో వీటికి సాటిరాగల పద్యాలు మరేవీ మనకు కానరావడం లేదు కూడా. మరి ఈ నాటకాన్ని చూచే ప్రతివారికీ ఈ పద్యాల్లోని భావం పూర్తిగా అర్థమౌతుందని మనం తలవడానిక్కూడా వీల్లేదు. ఇందులోని సంస్కృతపదాలు, సమాసాలు చదువుకున్నవాళ్లకే అర్థంకావడం కొంతకష్టం. ఇక చదువురాని వాళ్ల మాట చెప్పనవసరం లేదు. అయినా ప్రేక్షకులంతా ఈ పద్యాలు విని సంతోషిస్తున్నారు. అందులోని భావమంతా తమకు అర్థమైనట్లు తలచి మురిసిపోతున్నారు. భీమసేనుడితో ఆత్మైక్యం చెంది పరవశిస్తున్నారు. అందువల్ల ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. "మరోసారి మరోసారి వినాలి" అని కేకలు పెడుతున్నారు.