మీరు బెల్లం తింటున్నారా
బెల్లం ఔషధాల గని. పాతతరంలో బెల్లం వాడకం బాగుండేది. బెల్లంతోనే పలు రకాల తిండి పదార్థాలను వండేవారు. ఇప్పుడు ప్రతిదానికీ పంచదార వాడటం వల్ల బలవర్ధకమైన పదార్థాన్ని కోల్పోతున్నాం. దానికితోడు చక్కెర వల్ల పలు దుష్ప్రభావాలు పొడచూపుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రం బెల్లంకు ప్రాధాన్యం ఇస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించే గుణం బెల్లానికి ఉంది. ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తినడం మంచిది. జీర్ణప్రక్రియకు అవసరమయ్యే ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. కడుపులో గడబిడ తగ్గుతుంది.
పట్టణాలు, నగరాల్లోని చాలామందిని వేధిస్తున్న సమస్య రక్తహీనత. తరచూ బెల్లం తీసుకునేవాళ్లలో మాత్రం ఈ సమస్య తక్కువ. బెల్లంలో ఇనుము అధికం. తద్వార హిమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది.
శరీరంలో మలినాలను తొలగించుకునేందుకు రకరకాల ఆధునిక పద్ధతులు వచ్చాయి కానీ.. కాణీ ఖర్చు లేకుండా బెల్లంతోనే అది సాధ్యం అవుతుంది. కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.
శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గితే జలుబు, దగ్గు చుట్టుముడతాయి. ఒక్కోసారి ముక్కునుంచి నీళ్లు కారుతూ మైగ్రేన్ కూడా వస్తుంది. దీనికి చక్కటి విరుగుడు బెల్లం.
ప్రతిరోజు కొంచెం బెల్లం తింటుంటే జ్వరం రాదు.
జింక్, సెలీనియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. బెల్లంలో ఇవి పుష్కలం. బరువు తగ్గడానికీ బెల్లం పనికొస్తుంది. కాబట్టి మీరు రోజు ఏదో ఒక రూపంలో కొంచెమైనా బెల్లం తీసుకుంటే మంచిది.