ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAPPY SANKRANTHI FESTIVAL - ARTICLE BY Bramhasri Samavedam Shanmukha Sarma


పంచుకొని బతకాలని చాటే పండుగ
భారతీయ ధర్మం ఆధ్యాత్మికం - అని అనుకుంటాం. అంటే భౌతిక విషయాలను విస్మరించిందని అర్థం చేసుకుంటాం. కానీ హద్దు తెలిసిన ధార్మికమైన భోగం, భౌతికతను విస్మరించని సత్య దర్శనమే ఆధ్యాత్మికం. అందుకే ఈదేశంలో ;భూగాలమయమైన వేడుకలు పండుగలయ్యాయి. ఇందులో సామాజిక ప్రయోజనాలు, వైయక్తిక ముచ్చటలు, ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కలిసిపోయి ప్రవహిస్తాయి.
ఇహ పరాలకు వేసే అందమైన వంతెనలు భారతీయుల పండుగలు.
ఒకవైపు జ్యోతిర్మండలంలో జరిగే మార్పులు, తద్వారా భూవాతావరణంలో జరిగే పరిణామాలు, ప్రకృతితో మానవునికున్న సంబంధాలు, భాధ్యతలు, ప్రకృతిని శాసించే దేవతాశక్తులతో ఉన్న సహజమైన దివ్యానుబంధాలు..అన్నీ కలబోసి ఈ పండుగల సంస్కృతి వచ్చింది.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ హేమంతకాలపు సంబరంలో అందరూ దేవతల్లా మెరసిపోతారు. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ’కృతజ్ఞత’ అన్ ప్రధాన ధర్మాన్ని నిర్వహిస్తూ పంట చేతికందిన పెద్ద పండుగను పరిశీలిస్తే - మనవారి విశాల ప్రేమ స్వభావం విశిష్టంగా ప్రస్ఫుటంగా ప్రత్యక్షమౌతుంది.

నేల తల్లి ఇచ్చిన పంటను ధాన్యలక్ష్మిగా కొలుచుకొని, సాయపడిన పశువులను కూడా పూజించుకొనే కృతజ్ఞత మనది! సంపదను ఒక్కడే దోచుకొని, దాచుకొని తినకూడదని హెచ్చరించిన వేదవాక్యాలు పదిమందితో పంచుకుని ఆనందించమన్నాయి. అందుకే ’దానం’ అనే గొప్ప ఆచారం ఈ పండుగలో మరింత ప్రధానమయ్యింది.
ఊరంతా పండుగ కళ వెల్లివిరిసే వేళ, పెట్టే చేతుల ఔదార్యం ఉంది. కనుక గ్రామీణ కళలన్నీ ఈ వేళ పురివిప్పుతాయి.
దేవతలను కొలుచుకునే పుణ్యఘడియలివి- అని జప పూజాది ఆధ్యాత్మిక సాధనలు సాగుతాయి. ప్రేమను పంచుకొనే ఆనందవేళలివి - అని బంధుబలగాల మానవ ఆత్మీయతలు వెల్లివిరుస్తాయి. పూర్వీకులను స్మరించే పవిత్ర కాలమిది- అని పెద్దలనుద్దేశించి ప్రత్యేక దానాలు, తర్పణలు జరిపిస్తారు. ఉత్సాహాలు ఉప్పెనలై పందాలొడ్డుతారు.
పేరంటాళ్ళు పసుపు కుంకుమలూ, ఫలాలు పంచుకుంటారు. వ్యక్తికీ కుటుంబంతో, సమాజంతో, ప్రకృతితో, పరమాత్మతో ఉన్న అనుబంధాలు బలంగా గుర్తుచేసుకొని - వచ్చిన సంపదనీ, ఆనందాన్నీ అందరితో పంచుకొనే ఈవిధంగా ఈ మూడు, నాలుగు రోజుల పెద్ద పండుగను మన జీవన విధానంలో కలిపిన మహాత్ములకు జోహారులర్పించవలసిందే.
ఈ ఉత్తరాయణ పుణ్యవేళ సూర్యశక్తిని విశేషంగా అందుకుంటాం. ఈరోజునుంచి సౌరశక్తి మరింత చేరువవుతుంది. సూర్యకిరణాలను - వెలుగును ప్రేమించే ’భా’రతదేశమిది. ఆ కిరణాలలోనే దేవతా శక్తులున్నాయని వేదం చెబుతోంది. సూర్యుని అన్నప్రదాయకునిగా ఆరాధిస్తాం. రామాయణ, భారతాది గ్రంథాలు సైతం ’ఆదిత్యహృదయం’ వంటి అంశాల ద్వారా సూర్యోపాసన ప్రశస్తిని చాటాయి. సౌరమతం అని ప్రత్యేక వైదిక సంప్రదాయం సూర్యునే పరదైవంగా ఆరాధిస్తోంది.
అందుకే సంవత్సరానికి పగటి వేళ వంటి ఉత్తరాయణారంభం సూర్యుని మకరరాశి సంక్రమణాన్ని పండుగగా చేసుకుంది. జ్యోతిషపరమైన విశేషాలను కూడా ఇముడ్చుకున్న పండుగ ఇది - అని స్పష్టమవుతోంది కదా..!
మరొక విశేషం - ఈ దేశస్థుల హృదయాలలో ఉన్న కళా సంస్కారం! ప్రపంచ దేశాల మేధావులు ఇప్పుడిప్పుడే కనుగొంటున్న విజ్ఞాన రహస్యాలను ఆనాడే ఎలా గ్రహించారో మన పూర్వీకులు!
ఔషధీయ విలువలున్న గోమయంతో ఇంటి ముందు కల్లాపి - వాటి నడుమ ముగ్గులు! ఇంటి వాకిలినే కేన్వాస్ చేసుకొని, అరచేతిలో పిండి పట్టుకొని చుక్కల్ని కలుపుతూ ఎన్ని అద్భుత చిత్రాలను ఆవిష్కరిస్తారో ఈదేశపు ఆడపడుచులు!
ఎన్నో అద్భుతాలు అలవాటై పోవడం వల్ల మనకి వాటి విలువ తెలియడం లేదుగానీ - ఇంతకన్నా కళావిజ్ఞానం ఎక్కడుంటుంది?
ప్రతి చిన్న అంశాన్ని వ్యాపార పీఠాన్నెక్కించే సంస్కృతి కాదు మనది. అందుకే గొప్ప గొప్ప అంశాలు, కళా సంస్కారాలు ఇంటి ఆచారాలై సంప్రదాయాలై మిగిలిపోయాయి. ప్రతి గుమ్మాన్ని కళాపీఠంగా మలచి, పేడముద్దకి సైతం ముద్దబంతి పువ్వును అలంకరించి పసుపు కుంకుమతో పూజించడంలో ఎంత చక్కని సంస్కారం! కళాదృష్టి! దివ్యభావన!
ఈపండుగల వైభవాన్ని సవ్యంగా దర్శించడం నేర్చుకుంటే - ఎంతో తపస్సుతో సాధనతో ఒక నాగరిక జాతి సాధించగల గొప్ప ఆవిష్కరణలు మనకు ఇన్ని ఆనవాయితీల రూపాలలో ఏనాడో లభించాయని సంతోషించాలి.
ఈ పరుగుల రసహీన జీవితాల కాలంలో కూడా - ఇంకా ఈ వైభవాలు అక్కడక్కడైనా దర్శనమిస్తున్నాయంటే మన సంస్కృతిలోని జీవశక్తికి జేజేలు పలకాల్సిందే.