ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EVERYBODY THINKS BEER IS A SUMMER COOLER - BUT NOT - ITS DANGEROUS TO DRINK BEER IN SUMMER


చల్లని బీరుతో ఉపశమనం..కేవలం అపోహ.. 

* అనారోగ్యకరం 

వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లని బీరును ఆశ్రయిస్తుంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ హరికృష్ణ తెలిపారు. ఆరోగ్యానికి హాని చేయడంతోపాటు వేసవిలో బీర్లు ఎక్కువగా తాగడం వల్ల తొందరగా డీహైడ్రేషన్‌ బారిన పడే ముప్పు ఉందన్నారు. ఎండ వేడిలో బీరు, ఇతర ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ఇంకా ప్రమాదం ఉందని తెలిపారు.

* బీరు, విస్కీ, బ్రాందీ, వైన్‌...ఇలా అన్ని రకాల ఆల్కహాల్లో డయోరిటిక్‌ ప్రభావం ఉంటుంది. అంటే ఆల్కహాల్‌ శరీరంలోని నీటిశాతాన్ని తగ్గించేస్తుంది. దీనివల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతుంటారు. శరీరంలోని నీళ్లన్నీ బయటకు పోయి తొందరగా డీహైడ్రేషన్‌ బారిన పడతారు.

* చాలామంది బీరు, వైన్‌ తాగితే ఏమీ కాదనే భ్రమలో ఉంటారు. ఆల్కహాల్‌ ఏదైనా ప్రమాదమేనని గుర్తుంచుకోవాలి. పైగా బీరులో తక్కువ శాతం ఆల్కహాల్‌ ఉండటం వల్ల కిక్కు కోసం ఎక్కువ పరిమాణంలో బీరును తీసుకుంటారు. ఇది మరింతగా ప్రభావం చూపుతుంది. 650 ఎంఎల్‌ బీరులో ప్రతి 100 ఎంఎల్‌కు 6-7 శాతం, ప్రతి 100 ఎంఎల్‌ బ్రాందీ, విస్కీలో 47 శాతం, వైన్‌లో ప్రతి 100 ఎంఎల్‌కు 5-6 శాతం ఆల్క్‌హాల్‌ ఉంటుంది. ఇవి కాలేయం, మెదడు, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

* ఎండ తీవ్రత దృష్టా కొన్నిసార్లు ఒక్కొక్కరు 6-7 బీర్లు కూడా తాగుతుంటారు. కొందరైతే చుట్టూ స్నేహితులను పెట్టుకొని అదే పనిగా తాగుతూ ఉంటారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మూత్ర విసర్జనకు పోయి వస్తుంటారు. మళ్లీ బీరు తీసుకుంటారు. దీనివల్ల శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం ఇలా మూత్రం ద్వారా బయటకు పోతాయి. చెమట ద్వారా మరికొంత నీళ్లు బయటకు పోతాయి. ఇది తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.

* ఎక్కువగా బీర్లు తాగితే పొట్ట నిండిపోతుంది.అదనంగా నీళ్లు తాగడానికి ఆసక్తి ఉండదు. ఆహారం తీసుకునేందుకు ఇష్టం ఉండదు. అటు వేడి వేధిస్తుంది..ఇటు శరీరానికి నీళ్లు, సరైన పోషకాలు అందకపోవడం వల్ల తీవ్ర నీరసం వస్తుంది.

* తాగిన సమయంలో మెదడుపై నియంత్రణ తప్పుతుంది. అపుడు వాహనం నడపడంతో తొందరగా రోడ్డు ప్రమాదాలకు గురి అవుతుంటారు. వేసవిలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

* రోజుకు 90ఎంఎల్‌ కంటే ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. స్త్రీలలో అంతకంటే తక్కువ తీసుకున్నా తొందరగా పాడవుతుంది. అప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహం ఉన్న వారు అదే పనిగా ఆల్కహాల్‌ తీసుకుంటే ఇంకా తొందకగా కాలేయ జబ్బుల బారిన పడుతుంటారు.

* ఎండాకాలంలో బీరు ఇతర ఆల్కహాల్‌ జోలికి పోకపోవడం మంచిది. దాహం వేస్తే స్వచ్ఛమైన మంచినీళ్లు లేదంటే ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం మంచిది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఇవి కాపాడతాయి.