జిడ్డు తగ్గించే మార్గాలు!
జిడ్డు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఖరీదైన సౌందర్య సాధనాలే వాడాలని లేదు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
* తెల్లసొన: గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరాక చల్లటినీళ్లతో కడిగేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఎ విటమిన్, నిమ్మలోని సి విటమిన్ చర్మానికి అంది జిడ్డు సమస్యను తగ్గిస్తాయి.
* నిమ్మరసం: ఇందులోని సిట్రిక్ యాసిడ్ సహజ యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది. నిమ్మరసం, మినరల్ వాటర్‌ని సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుని నూనె లేని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
పెరుగు: రెండు చెంచాల పెరుగులో కొద్దిగా ఓట్‌మీల్ పొడి, చెంచా గోరువెచ్చని తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేయాలి.
* టొమాటోలు: వీటిలో కూడా సహజ యాస్ట్రింజెంట్ గుణాలుంటాయి. టొమాటో ముక్కతో ముఖం మీద మర్దన చేసుకోవాలి. వీలుంటే టొమాటో రసంలో కాస్త తేనె కలిసి ముఖానికి మర్దన చేస్తే మరీ మంచిది.
* యాపిల్: ఈ గుజ్జులో కాస్త, పెరుగు, నిమ్మరసం కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.
* కీరదోస: ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కీరదోస గుజ్జును చర్మానికి పూతలా వేసుకుంటే ఆ గుణాలన్నీ అంది.. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే కీరదోస రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి కడిగేసుకుంటే సరిపోతుంది.