ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD HANUMAN TEMPLE AT PRAYAGA - ARTICLE BY Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రయాగలో కోట సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి వారు నేలపైన పడుకొని ఉంటారు. విశాలమైన స్వరూపం. ఆ స్వామి పాదాలక్రింద రాక్షస స్వరూపంగా ఒక పెద్ద శిల నిర్మితమై ఉంటుంది. అ స్వామిని లేచి నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆలయం కూలిపోయిందిట. అందుకని స్వామిని అలాగే పరుండబెట్టి సింధూరంతో అలంకరించి ఈనాటికీ అర్చన చేస్తున్నారు. ఆంజనేయస్వామి పాదాలక్రింద శనైశ్వరుడు ఉన్నాడు అనే కథ జానపదులు వర్ణించినటువంటిది. శ్రీమద్రామాయణంలో సుందరకాండలోని వృత్తాంతాలలోని కథ ఇది. సీతాన్వేషణకు వెళ్ళే ఆంజనేయస్వామి వారు లంకానగరంలోనికి ప్రవేశించి లంకిణిని నిర్జించిన పిమ్మట అంతఃపురంలో ఉండే అనేక గదులలో సీతాదేవికోసమై అన్వేషణ చేస్తున్నాడు. అలా ఉండగా ఒక గది తలుపును మూసివేసినట్లుగా ఆంజనేయస్వామి వారు గమనించారు. ఈ గది తలుపులు మూసి వేశాడు కనుక సీతాదేవిని రావణాసురుడు ఇందులోనే బంధించి ఉంటాడు అనుకొని గది తలుపులు తెరిచి చూశాడట. తెరవగానే ఒక్కసారిగా ఆ గదిలోనుంచి ఎన్నో యేళ్ళుగా ఒక్కడై దిగులుతో బాధపడుతున్నటువంటి శనైశ్వరుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఆంజనేయస్వామి వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామీ! మీవలన నాకు విముక్తి కలిగింది అని నమస్కరించాడు. ఆంజనేయస్వామి వారు ఎవరు నీవు? అని ప్రశ్నించగా "నేను శనైశ్వరుడను, నా దృష్టి ఈ లంకా నగరం పడకూడదని రావణుడు నన్ను ఈ గదిలో బంధించాడు. నీవల్ల నాకు విముక్తి కలిగింది." అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు. లంకానగరానికి పతనం ఆరంభమైన నిమిషంగా చెప్తారు దీనిని.
అందరినీ బాధించేటటువంటి వాడనైన నేను ఈ ఆంజనేయ స్వామి వారిని బాధించలేనా? అనుకున్నాడట. శనైశ్వరుని ఆంజనేయ స్వామి తన పాదముల క్రింద తొక్కి పెట్టి ఉంచాడు అని ఇంకొక కథ చెప్తూంటారు. ఏం చెప్పినా ఆంజనేయస్వామి వారికి నమస్కరించే సమయంలో ఆయన రుద్రాంశ సంభూతుడు. నమస్కరించినంత మాత్రాన ఆయన పాదముల క్రింద అణచబడి యున్నటువంటి శనైశ్వరుడు మనకేదో కీడు కలిగిస్తాడు అనుకోవడం అసత్యం, అవివేకం అని చెప్పుకోవాలి. మనకు ఎటువంటి కీడూ రాకుండా శనైశ్వరుడిని తన పాదాల క్రింద అణచిపెట్టేంత అమిత పరాక్రమవంతుడైన ఆ ఆంజనేయుడు మనం నమస్కరించగానే ఆయన పాదములనుంచి తప్పించుకొని వచ్చి మనల్ని ఆశ్రయిస్తాడా? పట్టుకుంటాడా? కాబట్టి అటువంటి సందేహమే అవసరం లేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మిగిలిన వారంతా తప్పకుండా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే.