అందం - ఆరోగ్యం
• సన్నడేందుకు పద్ధతుంది..!
సన్నబడాలని అనుకోవడం ఆలస్యం.. ముందు ఆహారంలో మార్పులు చేయడం మొదలుపెడతారు చాలామంది. దాంతో చాలావాటిని మానేస్తూ.. కొత్త పదార్థాలు తింటూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందువల్ల అనుకున్న ఫలితం కలగకపోగా.. కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీరూ ఇందుకు మినహాయింపు కాకపోతే.. డైటింగ్ విషయంలో మీరెక్కడ లోపాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఫలానా పదార్థం తింటారా అని అడగడం ఆలస్యం.. నేను డైటింగ్ చేస్తున్నానని చెప్పకండి. ఎందుకంటే.. అది మీ మనసుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అంటే.. చేయకూడని పనేదో చేస్తున్నట్లుగా మీ మనసు భావిస్తుందట అలా చెప్పడం వల్ల ఆనందం కూడా ఉండదు. అందుకే కొన్ని తినడం మానేస్తున్నా డైటింగ్ గురించి ఆలోచించకూడదు.
చాలామంది బరువు తగ్గాలని నియమాలు పెట్టుకుని అన్నింటినీ తినడం మానేస్తుంటారు. ముందుగా పిండిపదార్థాలూ, కొవ్వూ తినడం మానేస్తారు. కానీ అది సరైన పనికాదు. పిండిపదార్థాలు హాని చేస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే. అన్ని రకాల పిండిపదార్థాలను పూర్తిగా తినడం మానేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. మెదడుకీ, శరీరానికీ శక్తి అంది, చురుగ్గా పనిచేయాలంటే పిండిపదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వీలున్నంతవరకూ సంక్లిష్ట పిండిపదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయండి.
పూర్తిగా ఏ మాత్రం ఇష్టంలేని పదార్థాలు తీసుకోవడం మొదలుపెడతారు కొందరు. అవి ఆరోగ్యకరం కాబట్టి.. అయిష్టమైనా తప్పనిసరిగా తినాలనుకోవడం సరైన పనికాదు. దానికి బదులుగా ఓ పని చేయండి. మీకు బాగా ఇష్టమైన పదార్థాల్లో పోషకాలు అందించేవి ఏవో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటిని తరచూ తీసుకునేలా చూసుకుంటే మంచిది.
కొందరు పూర్తిగా ఘనపదార్థాలు మానేసి, పండ్లరసాలూ, ఇతర ద్రవపదార్థాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారు. సమతులాహారం తీసుకుంటూనే సన్నబడేందుకు ప్రయత్నించాలి తప్ప.. అసలు తినకుండా పొట్ట మాడ్చుకుని మాత్రం కాదు.