మంగళగౌరీ వ్రత విధానం
శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకుసౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
మంగళగౌరీ వ్రత నియమాలు
తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :
పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.
మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం
వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.
పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.
మంగళగౌరీ వ్రత విధానం :
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)
విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా
సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!
వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.
తోర పూజ :
తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.
అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం – శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :
ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి
ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అర్జ్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి
అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.
రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.
తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..
ఆ తరువాత ఈ విధంగా చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.
శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :
పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.
అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.
మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.
ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.
మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.