రేపటి నుండి 03/08/2016
శ్రావణ మాసం ప్రారంభం.
పరమేశ్వరుడు స్వయంగా చెప్పినమాట:
12 మాసములలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణము. దీనికి ఈపేరు శ్రవణ నక్షత్రముతో కూడిన పూర్ణిమ నాడు రావడం వలన మాత్రమే కాక దీనియొక్క మాహాత్మ్యము వినుటకు ఆనందకరమై/యొగ్యమై అనేక సిద్ధులను ఇచ్చునది గావున ఈపేరు వచ్చినది.
శ్రావణ మాసంలో విధింపబడిన విధులలో ఏ ఒక్కటి అయినా శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు. నాకు ఈ మాసము కంటే ప్రియమైనది మరియొకటి లేదు. ఈమాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను. కోరికలు లేకుండా పూజించిన వారికి మొక్షాన్నీ ఇస్తాను. ఈ మాసంలో ఏ ఒక్క తిథి, వారము కూడా వ్రత ప్రాముఖ్యము లేకుండా లేవు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈమాసం గురించి చెప్తూ –ఎవరైతే శ్రావణ మాసంలో ఏక భుక్తము (ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.
ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నాము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి.
శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.
స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.
ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.