బ్రేక్‌ఫాస్ట్ మానొద్దు...!
మీరు రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినరా? అయితే ఊబకాయం పాలబడే ప్రమాదం ఉంది. ఈ మాటలు ఎవరో చెబుతున్నవి కాదు సాక్షాత్తూ శాస్త్రవేత్తలు అంటున్న మాటలు. ప్రొటీన్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ని మాత్రమే తినాలని వారు చెప్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల సన్నబడతామనే చాలామంది అభిప్రాయం తప్పని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేసి లంచ్, డిన్నర్‌లలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా ఎక్కువ తినడం వల్ల ఊబకాయం పాలబడే ప్రమాదం ఉందన్నారు. ఈ స్టడీలో భాగంగా 19 ఏళ్ల వయసున్న యువతీయువకుల ఆహారపు అలవాట్లను పరిశోధకులు తెలుసుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ఉంటే ఆహారం ఎక్కువ తింటారని తేలింది. బ్రేక్‌ఫాస్ట్ తినని రోజున స్వీట్లు కూడా బాగా తింటారని వెల్లడైంది. అదే బ్రేక్‌ఫాస్ట్ తిన్నవాళ్లల్లో స్వీట్ల పట్ల అంత యావ ఉండదని తేలింది. పోషకవిలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్ కూడా ఉండదట. ఈ స్టడీలో భాగంగా రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు, అవి శరీరంపై చూపే ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పోషకవిలువలు కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తింటే మంచిదని తేల్చారు. సో... బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని తేలుతోంది.
అందుకే ముఖ్యంగా అమ్మాయిలూ...
క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి ...
ఆరోగ్యంగా ఉండండి...!