ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ? మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము? ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ? నాతోనే చెప్పింతువేమయా , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా ? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?