ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PURANA TELUGU KATHALU - NARADHANUKI BRAHMA UPADESAM


నారదునికి బ్రహ్మ ఉపదేశం

"పరమ పురుషుడైన ఆ ఆది దేవుని లీలలను వర్ణింప నా తరమా నాయనా! నేనైనా, నారాయణుడైనా పరమ శివుని గురించి పరిపూర్ణ జ్ఞానులమని భావిస్తే అది అహంకారమే. అవాజ్మానస గోచరుడా మహా దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే - పరమ శివుడొక అద్భుతం అనాలి.

ఆ అద్భుత మూర్తి ఆద్యంతాలు లేని వాడు. అనాది మధ్య లయ రహితుడు. ప్రళయం అనే అపార జల రాశి మయం నుంచి ఆరంభిస్తే, కొంత వివరణ సుసాధ్యం కావచ్చు నేమో గానీ, అదీ మన భ్రాంతి మాత్రమే! అతడు నిత్యుడు. సత్య సత్వుడు. సమస్త సృష్టీ, సూర్య చంద్ర గ్రహ తారకాదులన్నీ తెలియ రాని అగాధం లోకి తరలి పోయిన ఆ తరుణాన...రాత్రీ కాని- పగలూ కాని ఓ విచిత్ర స్థితి ఆవరించిన వేళ... నిబిడాంధ కారమే దిగంత పర్యంతం వ్యాపించిన సమయాన... 'ఇదీ' అని వచింప శక్యం గాని సత్య జ్ఞాన సుందర మైనది ఏదయితే ఉంటుందో అదే 'శివం' అని ప్రకటిత మవుతోంది.

ముందే చెప్పినట్టు, అట్టి 'పరం' ('స్వ' కానిది)నుండి స్వయంభువంగా 'శివం' పరివర్తింప బడుతోంది. అదే సదాశివమని పరిఢ విల్లు తోంది. కనుక సదా శివం ఆవిర్భావానికి దోహద పడే ప్రకృతిని 'అంబ' అని భావించాలి! ఆమెయే సకలేశ్వరి.

ప్రకృతి పురుషుల క్రీడానంద ఫలితం - విష్ణు దేవుని రూప కల్పనకు నాంది. ఆయన ఎట్టి వాడు ? సకలేశ్వరీ సదా శివుల అంశ గనుక అతడు కూడా అమృత మూర్తి. త్రిలోక సుందరాకారుడు. శాంత గంభీరుడు, సత్వ గుణ పరి పూర్ణుడు. శంఖు చక్ర గదా పద్మ ధారి. పీతాంబరుడు. నీల మణి కాంతితో వెలిగే దేహం గల వాడు. జగజ్జెట్టీ, జగత్పూజ్యుడైన వాడూ అయిన పరమ పురుషునికి నమస్కరించి, తన కొక నామధేయాన్ని ప్రసాదించ మనగా- 'నా వలె నీవు కూడా జగత్తునంతట్నీనీకు నిశ్వాస రూపంగా కల్పిస్తున్నాను. ప్రళయాంతం వరకు తపో నిష్ఠా గరిష్ఠుడవు కమ్ము!' అని ఆనతిచ్చి అంబతో సహా అదృశ్యుడై పోయాడు."

* విష్ణువు నారాయణుడన బడుట :

ఆ విధంగా ఆనతి పొందిన విష్ణువు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపో దీక్షలో ఉన్నాడు. అయినప్పటికీ శివానుగ్రహం కలగక పోగా, అశరీర వాణి సూచనల మేరకు తిరిగి తపస్సులో మునిగి పోయాడు.

"అలా ఎంత కాలం ?.." నారదుని ప్రశ్న.

"ఇంత కాలం అని చెప్ప బడనంత చాలాకాలం! ఆయన శరీరం నుంచి విపరీత మైన జల ధారలు స్రవిస్తూన్నప్పటికీ, శివ మాయా వశాన విష్ణువు అలా ఆ నీట్లోనే పడి నిద్ర పోసాగాడు. అలా ఎన్నాళ్లు పడి వున్నాడన్నదీ ఎవరికీ తెలియదు. నీటి ధారలే ఆయనములుగా పడివున్న కారణంగా విష్ణువు నారాయణుడయ్యాడు. (నరః అంటే రుద్రుడు. అట్టి రుద్ర మాయా జనిత మగుట చే 'నారము' నీరు అనబడినది.)

తిరిగి విష్ణువు తెప్పరిల్లి లేచి చూచేలోగా సృష్టి క్రమం ప్రారంభమై పోయింది. అయితే అప్పటికి ఇంకా జీవజాలం ఉద్భవించ లేదు. రజస్స్త్తత్వ తమో గుణాలూ, అహంకారం, పంచతన్మాత్రలూ, పంచ భూతాలూ, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం... కలిసి మొత్తం 24 తత్వాలు పుట్టాయి.

నీటిలో ఉండగానే, నారాయణుని నాభి నుండి ఓ పద్మం జనించి, అలా పైకి ఎదగ సాగింది. కనుకనే - విష్ణువుకు పద్మ నాభుడనే నామాంతరం కలిగింది. ఈలోగా విష్ణుని నాభి కమలం లోకి శివ దక్షిణ భాగ జనిత మైన ఒక అంశ బ్రహ్మగా పరివర్తనం చెంది ప్రవేశ పెట్ట బడింది. ఆ శివాంశకు ముఖాలు నాలుగు. చతుర్ముఖుడైన ఆ మహా వేత్త గర్భంలో బంగారం నిక్షిప్తమైనందున, అతడికి హిరణ్య గర్భుడనే మరో పేరు కలిగింది.

అయితే - శివలీలా విలాసం కనుక, కేవలం అలా అంతూ - దరీ లేకుండా పైకెదుగుతున్న తామరపువ్వే తన లోకం తప్ప ఇతర ప్రపంచం ఏమిటో - ఎలా వుంటుందో కూడా చతుర్ముఖునికి అంతు పట్టలేదు."