మహా మృత్యుంజయ మంత్రం (దీర్ఘాయువు)
" ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామ్రుతాత్ "
ఇది మహా మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం అపమృత్యువును తొలగించడమే కాక దీర్ఘాయువు, శాంతి, సౌఖ్యం, ధనధాన్యాలు, సంపద, సంతోషం ప్రసాదించే పవిత్రమైన మంత్రం. పాముకాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు, వంటి అనుకోని దుర్ఘటనల నుంచి కాపాడే కవచం. భక్తీ విశ్వాసాలతో ప్రతి నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే మొండి రోగాలు సైతం నయమవుతాయి అని ఋషుల ఉవాచ.
స్నానం చేస్తూ ఈ మంత్రం జపిస్తే రోగ విముక్తులవుతారు. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. పాలు తాగేటప్పుడు జపిస్స్తె యవ్వనం చేకూరుతుంది. రోగుల చెవిలో ఈ మంత్రాన్ని క్రమసంఖ్య లో జపిస్తూ ఉంటె వ్యాధి నుంచి విముక్తి కలిగి ఆయుర్దాయం పెరుగుతుంది. గృహం లో చిక్కు సమస్యలు, చికాకులు ఉంటె పండితులచే ఇంటిలో మృత్యుంజయ హోమం చేయిస్తే చికాకులు తొలగి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
గాయత్రీ మంత్రం, చంద్ర శేఖర అష్టకం, విశ్వనాధాష్టకం, సౌందర్యలహరి చదవడం వలన కూడా మృత్యువును అడ్డుకోవచ్చు.
ఆహార అలవాట్లు కూడా ఆయుర్దాయం పెంచడంలో ఎంతో దోహదం చేస్తాయి అని ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. రాత్రి పూట పెరుగు తినడం వాళ్ళ ఆయువు క్షీణిస్తుంది అని పాలతో అన్నం తినడం వలన ఆయువు పెరుగుతుందని అంటారు.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, తల స్నానానికి చన్నీటిని, మాములు స్నానానికి గోరువెచ్చని నీటిని వాడడం, వారానికోసారి నువ్వుల నూనెను ఒంటికి మర్దనా చేసుకుని అభ్యంగన స్నానం చేయడం, బాగా వేడిగా లేదా బాగా చల్లగా ఉండే పదార్ధాలను తినక పోవటం, పంచ గవ్యాలను సేవించడం, సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం, ఎడమ చేతివైపుకు తిరిగి పడుకోవటం భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం వంటివి ఆయుర్దాయాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెపుతోంది.
భారతం లో ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా విదురుడు ఇలా సమాధానం చెపుతాడు. "గర్వము, హద్దు మీరి మాట్లాడడం, మహాపరాధాలు చేయడం, క్రోధం, తన సుఖమే తను చూసుకోవటం నమ్మిన వారిని మోసం చేయడం అనే ఆరు లక్షణాలు పదునైన కత్తుల వంటివి. ఈ ఆరు, మానసిక ప్రశాంతతను పోగోట్టతమే కాకుండా, దేహాన్ని కూడా క్షీనింప చేస్తాయి." నిజానికి మృత్యువు కన్నా బలమైనవి ఇవి. కనుక ఈ లక్షణాలకు దూరంగా ఉంటూ పైన చెప్పిన విధి విధానాలను పాటిస్తూ ఉంటె ఆయుస్శును పొడిగించు కోవడం సాధ్యమే.
దీర్ఘాయుష్మాన్ భవ!