శంకరాచార్యుల ఆనందలహరీ
శ్లోకం - 1
.
భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతిః
తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః
.
ఓ భవానీ ! ప్రజలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలుగు ముఖములతోనూ , త్రిపురాసురుని మర్దించిన ఈశ్వరుడు ఐదు ముఖములతోనూ , దేవసేనానాయకుడగు సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖములతోనూ , ఆదిశేషువు వేయి ముఖములతోనూ నిన్ను స్తుతించలేనిచో ఇతరులు ఎవరు నిన్ను స్తుతించగలరు తల్లీ ?
నీవే చెప్పు .
.
.
శంకరాచార్యుల ఆనందలహరీ -
శ్లోకం - 2
ఘృతక్షీర ద్రాక్షా మధుమధురిమా కైరపిపదై
ర్విశిష్యా నాఖ్యేయా భవతి రసనామాత్ర విషయః |
తథాతే సౌన్దర్యం పరమశివ దృఙ్మాత్ర విషయః
కథంకారం బ్రూమః సకల నిగమాగోచర పదే || 2 ||
.
నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనె వీటి మాధుర్యము మాటలతో వర్ణించనలవికానిది . ఆ మాధుర్యము నాలుకకు మాత్రమే తెలియును. అదే రీతిగా అమ్మా ! నీ సౌందర్యం వర్ణించి చెప్పడానికి సకలవేదాలకూ శక్తి చాలదు తల్లీ, అది పరమశివుని కన్నులకు మాత్రమే ఎరుకగానీ, మాబోటివారు వర్ణించగలమా తల్లీ !
.
శంకరాచార్యుల ఆనందలహరీ -
శ్లోకం - 3
ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్ || 3 ||
.
నోటి యందు తాంబూలంతో, కళ్ళకు కాటుకతో, నొసటన కాశ్మీరతిలకంతో, నడుము నందు కాంతులీను వడ్డాణముతో, మెడలో ముత్యాల హారాలతో, బంగారు చీరతో ప్రకాశిస్తున్న హిమవత్పర్వతరాజపుత్రిక అయిన గౌరిని నేను సదా సేవించుచున్నాను .
.
శంకరాచార్యుల ఆనందలహరీ -
శ్లోకం - 4
విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటీ
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా |
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే || 4 ||
.
ఓ శంభుని సతీ! కంఠమునుంచీ కల్పవృక్ష కుసుమాలమాలలు వ్రేలాడుతుండగా శోభిల్లు వక్షస్థలముతోనూ, మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్న కుండలములతోనూ, కొంచెము ముందుకు వంగినటువంటి శరీరముతోనూ(భక్తులను అనుగ్రహించుటకు ముందుకు వంగిందిట), ఆడ ఏనుగు వంటి అందమైన నడకతోనూ, పద్మముల వంటి కన్నులతోనూ శోభిల్లు తల్లీ! నీకు విజయమగుగాక.
.
శంకరాచార్యుల ఆనందలహరీ -
శ్లోకం - 5
నవీనార్క భ్రాజిన్మణి కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిత నయనాంగీకృత శివా |
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ || 5 ||
.
ఓ అపర్ణా! అప్పుడే ఉదయించిన బాలభానుడిలాగా దేదీప్యమానంగా ప్రకాశించే సువర్ణ మణిమయాది సర్వాభరణాలతో సర్వాంగభూషితవూ, ఆడలేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు కలదానవూ, పరమశివుని పతిగా స్వీకరించినదానవూ, మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవూ, పసిడి పీతాంబరం ధరించినదానవూ, మువ్వలపట్టీలతో కళకళలాడుతూ పరిపూర్ణురాలివైన నీవు నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించెదవుగాక.