ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO Senior cartoonist Mohan


అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

అనగనగనగా.. అవి తెలుగునాట 336 ఛానళ్లు లేని రోజులవి. దినపత్రికలు, వారపత్రికలే.. ప్రజలకు నిత్య సమాచార, వినోద సాధనాలుగా ప్రచండభానులై ప్రజ్వలిస్తూ.. మంచో, చెడో, యమ గడ్డుగానో సాగిపోతున్న రోజులవి. సరిగ్గా ఆ రోజుల్లో.. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వ్యంగ్య చిత్రకళా సామ్రాజ్యాన్ని ఎడాపెడా ఏలూతూ.. ఆ రాజ్యంలోని ప్రజల్ని కూసింత నవ్విస్తున్న రోజులవి. అప్పుడే.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓ ఉంగరాల జుట్టుపిల్లాడు.. కలము, కుంచె, పెన్సిలు, రబ్బరు చేతపట్టేను.. ఇండియన్‌ ఇంక్‌ అంటే ఏంటో తెలియని ఆ కఠినమైన రోజుల్లో.. ఆ సిరాబుడ్డిలో పాయింట్‌ బ్రష్‌లు, క్రోక్విల్స్‌.. ముంచేసి.. బరబరా.. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా.. నల్లని గీతలు గీసేను.. అలా గీసి గీసి.. కొందరికి చెమటలు పట్టించెను.. మరికొందరికి ముచ్చెమటలూ పోయించెను.. ఇంకొందరికీ పదండి ముందుకు పదండి త్రోసుకు.. అంటూ తమ పిడికిళ్ళు బిగించుకుని వినువీధిలన్నీ దద్దరిల్లేలా చేసేను. అలా చేసిన మహానుభావుడే ఆర్టిస్‌ మోహన్‌. 

ఆయనిప్పుడు లేడు. వెళ్తూ.. వెళ్తూ కూడా టీవీవాళ్ళను తికమక పెట్టి.. ఆనక చేసిన తప్పుకు వారంతా పరమ రోదించేలా.. వెంటిలేటర్‌ సాక్షిగా బురిడీ కొట్టించి.. ఫేస్‌బుక్కులోని ముందస్తు సంతాపాలు.. కపిత్వాలు.. దొంగేడుపులు, పుకార్లు, షికార్లు గట్రా.. చూసి.. ఐసీయూలో ఉంటూనే పడీపడీ నవ్వుకుంటూ.. ఆనక ప్రశాంతంగా తుదిశ్వాస విడిచివెళ్ళిన ఓ సరదా మనిషి. మోహన్‌ ఇక లేడు. ఇది రోటీన్‌ డైలాగ్‌. కానీ.. ఆయన నిలువెల్లా గీతల్లో.. తెలుగు చిత్రకళా జగత్తులో.. చురకత్తిలా మెరిసే నిత్య సమ్మోహన గీతం. కొన్ని తరాల దాకా.. గీతోపదేశం చేసే గీత కార్మికుడు.
మోహనా.. అయితే ఏంటంట?! 

మోహన్‌ గీతలు.. కోనసీమ కొబ్బరి తోటల్లో బాగా సూరేకారం దట్టించి.. ఆకాశంలోకి వదిలిన హైపవర్‌ తారాజువ్వలా కనిపిస్తాయి. ఎందుకంటే.. ఆయన బుర్రలో దాగిన సూరేకారం పవర్‌ అలాంటిది. దాంట్లో ఎంత గంధకం పొడి కలపాలో.. అలా నూరినూరి కూరికూరిన ఆ తారాజువ్వల్ని ఏయే సందర్భాల్లో.. ఎక్కడ, ఎలా వదలాలో బాగా తెలిసిన చిత్రకారుడాయన. ఆయన ఎవరి రికమెండేషనో పట్టుకుని.. సరాసరి పేపర్లోకొచ్చి రాతలు.. గీతలు గీసేయలేదు. చదువుకునే రోజుల్లోనే ప్రజాసమస్యలపై బేనర్లు లగాయతు.. సైన్‌బోర్డులూ పిచ్చపిచ్చగా రాసేసిన మెలికలు తిరిగిన చెయ్యది. అందుకే.. ఆ చేతిలో.. కార్టూన్‌ అయినా.. బొమ్మయినా.. ఇలస్ట్రేషన్‌ అయినా.. క్యారికేచర్‌ అయినా.. అంతే రాటుదేలినట్టుగా పాఠకులకు దగ్గరయ్యింది. కొత్తగా కనిపించింది. అలా ఏపుగా పెరిగిన వటవృక్షమైంది. ఇక ఆ.. ఊడల్ని పట్టుకున్నోళ్ళయితే లెక్కే లేదు. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకునేవాళ్ళు కొంతమంది.. చెప్పుకోడానికి మొహమాటం పడేవాళ్ళు ఇంకొంతమంది.. ఏకలవ్య గుణం గల గణం మరికొంత మంది.. ఇలా ఆయన బార్లా తెలుగు చిత్రకళా నేలపైకి విసిరిన ఆ ఊడల్ని.. గట్టిగా పట్టుకుని చాలామంది నవయవ్వన, ముదురు ఆర్టిస్టులు ఇంకా ఊగుతూనే ఉన్నారు. ఆ ఊడ అలాంటిది మరి. అతని జాడ అంత గొప్ప.

పిచ్చపిచ్చగా నచ్చినోడు

బొమ్మలు వేయడం వచ్చు.. అని తెగ ఫీలయిపోయే చాలామంది పల్లెటూరి పోరగాళ్లను గుర్తించి.. సరాసరి జుట్టు పట్టుకుని లాక్కొని రాకపోయినా.. తనదైన పేరు, ఆకర్షణ, గ్లామర్‌తో ఎందరినో హైదరాబాద్‌ బాట పట్టించిన బొమ్మల మాంత్రికుడాయన. వెనకటికి 'మోహన్‌ డెన్‌' అని ఒకటి ఉండేది. చిన్నాచితకా పెద్ద, మధ్య, పరమ, ఉత్తమ కళాకారులూ, రచయితలూ, కళాకారులకు ఆ డెన్‌.. ఓ అక్షయపాత్రగా సేద తీర్చింది. అక్కడికి వచ్చినవారికి గుండెల నిండా బలం నింపిన ఘట్టాలు.. రోజులు నెమరేసుకుంటే.. ఆర్టిస్టు కులపోళ్ళు తమ అనుభవాలను పెద్దపెద్ద గ్రంథాలుగా మలచకుండా ఉండలేరు. కత్తిలాగా బొమ్మలేసే వాడిని.. పరమ సుత్తిలా గీతలు గీసేవాడిని.. ఒకేలా ఆత్మీయంగా పలకరించి.. 'నీ కార్టూన్లు, బొమ్మలు బాగున్నాయబ్బా!' అంటూ భుజంపై చేయేసి.. స్నేహ 'గీతంగా' ఆదరించడం ఆయన సహజశైలి. ఇంకా చెప్పాలంటే ఆయనకు మాత్రమే ఉండే అందమైన గుణం కూడా అదే!
చాలామందికి పత్రికలో బొమ్మలు, కార్టూన్లు గీయడమంటే ఓ కల. ఆ కల(ళ) ను నిజం చేసుకునే క్రమంలో.. చాలామంది కుర్రాళ్ళు మోహన్‌ గారి చిత్రపటాన్ని మనసులో ముద్రించేసుకుని.. ఆయనతో కరచాలనం చేస్తే చాలు.. ఇక కార్టూనిస్ట్‌ అయిపోయినట్టే లెక్క అని.. ధైర్యం తెచ్చుకుని అలా ఒక ఫైన్‌ మార్నింగో లేదా ఓఫైన్‌ సాయంత్రమో.. ఆయనతో కరచాలనం కోసం తిరగాడిన బుల్లి ఆర్టిస్టుల్ని లెక్కపెట్టడం కూసింత కష్టమైన పనే. అలా తిరిగి, పరితపించి, ఆయనతో ఓ చిన్న కరచాలనం దొరికే ఛాన్స్‌ వచ్చిందో ఇక అంతే.. చొక్కా గుండీలూడిపోయేంత సంతోషంతో.. చాలా హేపీ హేపీగా నాలుగు కార్టూన్లు గీసేసి.. నాలుగు పత్రికాఫీసులు చుట్టూ తిరిగిన రోజుల్ని ఇప్పుడు చలామణిలో ఉన్న చాలామంది కార్టూనిస్టులు ఆ విషయాన్ని తమ జీవితకాలంలో మర్చిపోవడం కష్టమే. 'ఇదిగో.. అబ్బా.. బొమ్మ ఇలా గీయాలే..' అని వేలు పట్టి బొమ్మలు గీయించకపోయినా.. ఆయన బొమ్మల ప్రభావం, మార్క్‌.. ఇప్పటికీ చాలామంది ఆర్టిస్టుల్లో చూడొచ్చు. అది దాచాలన్నా దాచలేని గీతది. 

ఆ రాతలే వేరబ్బా ...
మోహన్‌ బొమ్మలే కాదు... ఆయన రాతలూ అద్భుతం. అప్పుడప్పుడు పేపర్లో రాసిన వ్యాసాలే కాదు, 'కార్టూన్‌ కబుర్లు'గా తెచ్చిన పుస్తకం ఒక్కటి చాలు.. ఆయనెంత జగాన్ని చుట్టిన, జగమెరిగిన రచయితో అని.. బొమ్మలేసేవాళ్ళు రాయలేరు.. రాయగలవారు బొమ్మలేయలేరు... అన్న పరమ బోడి, ముదనష్టపు స్టేట్‌మెంట్‌ని సంపూర్ణంగా చెరిపేశారు మోహన్‌. అన్నట్టు బొమ్మలేసేవాళ్ళు చూడ్డానికి పరమ పిచ్చోళ్ళా ఉంటారని.. చాలామంది అపోహ. కానీ మోహన్‌ని చూస్తే మాత్రం. అందగాడంటే ఇలా ఉండాలని ఆడాళ్ళకే కాదు, ఏ మగాడికైనా అనిపించక మానదు. ప్రతిభ ప్లస్‌ అందం కలగలిపిన మగపుంగవుడాయన.

ఒక్కడు కాదు
చాలామంది.. మోహన్‌ని.. ఆర్టిస్ట్‌ మోహన్‌ అంటారు. ఇలా అనేస్తే.. అతడిలోని బహుముఖీనమైన కోణాన్ని ఆవిష్కరించడంలో ఎలాంటి తప్పులతడకలు ఉండవులే అనే భావన కావొచ్చు. మోహన్‌గారి కులపోళ్లయితే ఆయన్ని కార్టూనిస్ట్‌ అంటారు. నిజానికి మోహన్‌ ఏ ఒక్క ప్రక్రియకో పరిమితమైన సాదాసీదా మనిషి కాదు. ఆయకు తెలిసినవి.. అందులో తడిసి ముద్దయినవి చాలా ప్రక్రియలే ఉన్నాయి. కార్టూనిస్ట్‌, ఇలస్ట్రేటర్‌, పెయింటర్‌, యానిమేటర్‌, పత్రికా రచయిత. కార్టూన్‌, యానిమేషన్లో సాంకేతికంగా ఎంతో తెలిసిన క్రియేటర్‌.. ఇంకా వాట్‌ నాట్‌.. అనేకం.
ఉనికి అలాంటిది

మోహన్‌.. అసలు ఆ పేరులోనే మూడు, నాలుగు తరాలకు సరిపడా ఉనికి, అస్తిత్వం ఉంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే తప్పదు. ఆ ఉనికి ఎలాంటిదంటే.. ఆయన బొమ్మల్లో ఒదిగిన శ్రమజీవులు ఆకాశం వైపు తిరిగి.. గట్టిగా బిగించి ఉద్యమించే ఓ బలమైన పిడికిల్లాంటిది. పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా మోహన్‌ తెలుగు పత్రికలకు చూపిన దారి వేరు. ఆ దారినే విరుచుకుపడ్డం అంటారు. మీటరు లెక్కలేసుకుని, నాలుగు చట్రాలు గీసుకుని, కార్టూన్‌ బొమ్మ ఇంతే ఉండాలి. ఫలానా నాయకుడి పోలికలు.. అందులోని పరిమితులు.. ఇలానే ఉండాలని ఏరోజూ గుండ్రంగా ఉన్నచోటనే చతికిలపడిపోలేదు. మోహన్‌ బొమ్మంటే రోషం గల బొమ్మ. నిజాన్ని సుత్తిమెత్తని కత్తితో కూడా పదునుగా చెప్పగలిగే నల్లని డప్పు దరువది. అందుకే ఆయన బొమ్మ.. దేశం నలుమూలలా ఉన్న గోడలపైకెక్కి.. బిగ్గరగా అరిచింది. నిజాన్ని నిర్భయంగా చెప్పే చెరగని సంతకమైంది. 

అక్షరాలు చెప్పిన మాట
''కొందరెందుకో పుడతారు. ఎందుకో పోతారు. వారికిగానీ, వారి వారికిగానీ, జనాలకిగానీ కారణాలు తెలీవు. కొందరుంటారు. వారి రాతల చేతా, చేతల చేతా, మళ్లీ మళ్లీ తిరిగొస్తారు. అపుడు మన చుట్టూ ఆదర్శం ఆవరిస్తుంది. ఒక అశరీరవాణి వినిపిస్తుంది. దారి చూపిస్తుంది.. కదిలిస్తుంది.. ముందుకి నడిపిస్తుంది. ఐన్‌స్టీన్‌, చార్లీచాప్లిన్‌, పాబ్లో నెరూడా, టాల్‌స్టారు, మార్క్స్‌, గాంధీ, ప్రేమ్‌చంద్‌, ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి, బడే గులాం అలీఖాన్‌లను మనం ఒట్టి పుణ్యానికే తలచుకోం. మనదారి వెతుక్కోవడం కోసం, మనం ప్రపంచాన్ని చూసేచూపు తెలుసుకోవడం కోసం తలుచుకుంటాం. తోలుతిత్తి వంటి ఈ శరీరానికీ, తూట్లు తొంబది పడ్డ గుండెకీ.. పారదర్శకమైన ఆత్మకీ.. నిత్యజీవితం తగిలించే తుప్పుని వదిలించడానికీ తప్పక తలుచుకుంటాం. అది మన అవసరం'' అని ఆయన ఒక సందర్భంలో ఒక వ్యాసంలో చెప్పిన ఈ మాటలు.. నిజానికి మరో ఆర్టిస్టుకి నివాళిగా రాసినాగానీ.. ఇప్పుడు మాత్రం ఈ మాటలన్నీ అక్షరాలా మోహన్‌కే వర్తిస్తాయి.
చివరిగా.. ఆయన మాటతోనే ముగిద్దాం. 

''ఇలస్ట్రేటర్‌, కార్టూనిస్ట్‌ అంటే జోకర్లనీ, కాన్వాస్‌ మీద ఆయిల్స్‌ వేసేవారు హీరోలనీ చిత్తశుద్ధితో చాలామంది మేధావులు, రచయితలు నమ్ముతారు. ఈ పెయింటింగ్‌లని అమ్మే గేలరీల వాళ్లు.. కొనుక్కునే పిచీరిచ్‌ కళాభిమానులూ ఇదే నమ్ముతారు. చదువు లేకపోవడం, చదువు రాకపోవడం, చూసే కంటికి శిక్షణ లేకపోవడంలాంటి కారణాన ఇలాంటి మూఢనమ్మకాలు కలగడం కద్దు'' అంటూ కార్టూనింగ్‌ కళపై కొందరికి గల చిన్నచూపుని తనదైన పంథాలో చెప్పిన మోహన్‌ ఓ.. నిజాన్ని దాచుకోకుండా చెప్పకనే చెప్పే ఓ పగలబడే నిప్పు. ఆ నిప్పు ఇప్పట్లో చల్లారదు.

- గంగాధర్‌ వీర్ల