ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LEGENDARY TALENTED CINE ARTIST AND SINGER, MAHANATI BHANUMATHI GARU - Bhanumathi Ramakrishna - Profile, Biography and Life History


*బహుముఖ ప్రజ్ఞకు మరో పేరు భానుమతి!**

భానుమతి పేరు వినగానే ఆమె బహుముఖ ప్రజ్ఞ ముందుగా 
మన స్మ­ృతిపథంలో మెదలుతుంది. నటిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, కథకురాలిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా... ఇలా పలు విధాలా తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన మరోనటిని మన భరతభూమిలో చూడబోము. అహంభావాన్ని కూడా అందంగా ప్రదర్శించే నేర్పు భానుమతి సొంతం! అందుకు ఆమె బహుముఖప్రజ్ఞ కంచుకవచంలా నిలచి ఆ అందానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ ఉంటుంది. అదే ఆమెను అందరిలోకి మిన్నగా నిలిపింది.

భానుమతికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు రావాలని ఆమె అభిమానులు అభిలషించవచ్చు. దాదా సాహెబ్‌ ఫాల్కే వంటి అవార్డును ఆమెకు ప్రదానం చేయలేదని చింతిల్లనూ వచ్చు. ఆమెలోని బహుముఖప్రజ్ఞాపాటవాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించితీరాలి. మరి ఒక్క ఫాల్కేనే ఇస్తే ఎలా!? ఆ స్థాయి ఉన్న అవార్డులు ఎన్నో ఆమెను చేరాలి. ఆమెకు లభించిన అవార్డులన్నీ ఆమె ప్రతిభాపాటవాలను చూసి మురిసిపోయి పరుగులు తీస్తూ వచ్చి వడిలో వాలినవే తప్ప ఏనాడూ ఆమె అర్రులు చాచి అవార్డులకై పాకులాడింది లేదు. అలా అయితే ఆమె భానుమతి ఎందుకవుతుంది!? ఏ కళాకారులకైనా ప్రజల మన్ననలను మించిన అవార్డులేముంటాయి. భానుమతిలోని ప్రతి కళకు జనం నీరాజనాలు పట్టారు. అంతకంటే ఏం కావాలి? అందుకే ఆమెకు ఏదైనా అవార్డు నిస్తే 'ఈ అవార్డు ఆమెకు ఎప్పుడో రావలసింది' అని ఇచ్చేవారే నొచ్చుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. బహుశా ఫాల్కే అవార్డు విషయంలో కూడా నిర్ణేతలు ఇలాగే భావించారేమో! ఆమె అభిమానులు ఆశించినన్ని అవార్డులు రివార్డులు రాకున్నా భానుమతి ప్రజ్ఞాపాటవాలే ఆమెకు ఎనలేని గౌరవాన్ని ప్రేక్షక హృదయాలలో సంపాదించి పెడుతున్నాయి. అంతకంటే ఓ కళాకారిణికి ఏం కావాలి!?

1924 సెప్టెంబర్‌ 7న (భానుమతి స్వయంగా 'పెళ్ళికానుక' షూటింగ్‌ సమయంలో చెప్పిన తేదీ) భానుమతి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. సంప్రదాయ కుటుంబం కావడం వల్ల బొమ్మరాజువారు తన కూతురుకు చిన్నతనంలోనే భాషాపాండిత్యాన్ని, లలితకళలను అభ్యసింప చేశారు. చిరుతప్రాయంలోనే భానుమతి రామాయణ, భారతాల్లోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించేవారు. అలాగే చిన్నతనంలోనే రచనలు చేసి, తన తండ్రి స్నేహితులైన మేటి పండితులను అబ్బుర పరిచారు. నాట్యంలోనూ అతి తక్కువ సమయంలో ప్రావీణ్యం సంపాదించారు. సుబ్బయ్య కూతురి ప్రతిభాపాటవాలను చూసి ఇరుగు పొరుగువారు సైతం మురిసిపోయేవారు.

పదమూడేళ్ళ ప్రాయానికే భానుమతి తన అందచందాలతో యువకుల మతులు పోగొట్టేది, ఆ సమయంలోనే తన ప్రతిభాపాటవాలతో పండితుల ప్రశంసలూ అందుకునేది. ఆమె గురించి ఆ నోటా, ఈ నోటా విని సి.పుల్లయ్య తన దర్శకత్వం లో రూపొం దిన 'వరవిక్రయం' (1939) చిత్రం ద్వారా భానుమతిని సినిమా రం గానికి పరిచ యం చే శారు. సు బ్బయ్య మ రీ ఛాందసులు కావడంతో తన కూ తురుపై చిత్రీకరించే ప్రేమ సన్నివేశాల్లో కౌగిలింతలు ఉండరాదని షరతు పెట్టేవారు. అందుకు అంగీకరించిన వారి చిత్రాల్లోనే భానుమతిని నటింప చేసేవారు. అదే భానుమతికి అలవాటయింది. అందుకే ఆ తరువాతి కాలంలో కూడా భానుమతిని కౌగిలించుకోవడానికి హీరోలు సంశయించేవారు. అయితే పాత్రకు అనుగుణంగా నటించడానికి తన సహ నటీనటులను హుషారు పరచడంలోనూ ఆమె ముందుండేవారు.
తనకు మర్యాద లభించకుంటే ఎంతటివారినైనా ఆమె లెక్క చేసేది కాదు. ఆ రోజుల్లో కొందరు దర్శకులు తామే అందరికంటే మిన్న అన్న భావనతో హీరోయిన్లను చులకనగా 'ఒసేయ్‌, ఏమే...' అంటూ పిలిచేవారు. ఓ తమిళచిత్రం షూటింగ్‌లో దర్శకుడు భానుమతిని అలాగే "ఏమిటే... డైలాగ్‌ చూసుకున్నావా!?'' అన్నాడు. అంతే ఆత్మాభిమానం మెండుగా ఉన్న భానుమతి, "ఏమిట్రా... డైలాగు చూసుకునేది?'' అని అనేసరికి, సదరు దర్శకునికి, చుట్టు పక్కల ఉన్నవారికి మతిపోయింది. అప్పటి నుంచీ ఆమె అంటే చాలామందికి హడల్‌. అయితే తనను గౌరవించేవారిని, ఆమె కూడా ఎంతో గౌరవించేవారు. దటీజ్‌ భానుమతి అని నాటి సినీప్రముఖులే ఆమెను ఎంతో గౌరవించేవారు. ఆమె వ్యక్తిత్వం భిన్నమైనది. తన ప్రతిభాపాటవాలతోనే తన జీవితాన్ని నిర్మించుకున్న భానుమతి పెళ్ళి విషయంలోనూ ఆ రోజుల్లోనే తన మనసుకు నచ్చినవాణ్ణే మరీ వరించింది. నాటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి. రామకృష్ణను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. తరువాత దర్శకునిగా రామకృష్ణ, నిర్మాతగా ఆమె తమ 'భరణీ స్టూడియోస్‌' ద్వారా పలు చిత్రాలను రూపొందించారు.
నటిగా...

తొలి చిత్రం 'వరవిక్రయం'లోనే నటిగా తన ప్రతిభను చాటుకున్నారామె. 'కృష్ణమ్మ' చిత్రం షూటింగ్‌ సమయంలోనే రామకృష్ణను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, బి.యన్‌. రెడ్డి ప్రోద్బలంతో, భర్త ప్రోత్సాహంతో ఆమె 'స్వర్గసీమ'లో నటించారు. ఇందులో ఆమె పోషించింది వాంప్‌ పాత్రే అయినా, ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగింది. ఆ తరువాత "మల్లీశ్వరి, లైలామజ్నూ, చండీరాణి, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, అంతస్తులు, అగ్గిరాముడు, వివాహబంధం, తోడు-నీడ, గృహలక్ష్మి, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే'' తదితర చిత్రాలలో అనితర సాధ్యమైన అభినయాన్ని ప్రదర్శించారు. చాలా ఏళ్ళ తరువాత 1984లో కోడి రామకృష్ణ, 'భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌' గోపాల రెడ్డి అభిలాష మేరకు 'మంగమ్మగారి మనవడు' చిత్రంలో మంగమ్మ పాత్రను పోషించారు. ఆ తరువాత "అత్తగారూ స్వాగతం, ముద్దుల మనవరాలు, సమ్రాట్‌ అశోక, మొరటోడు నా మొగుడు, బామ్మమాట బంగారుబాట, పెద్దరికం, పెళ్ళికానుక'' వంటి చిత్రాల్లో నటించారు. ఏ పాత్ర పోషించినా, అందులో తనదైన పంథాను ప్రవేశపెట్టి అభినయించి, తనకు తానే సాటి అనిపించుకోవడం ఆమెకే చెల్లింది.

నిర్మాతగా...
భానుమతి తరంలో మేటి హీరోలయిన యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ వీరి 'భరణీ సంస్థ'లో నటించారు. ఏయన్నార్‌ ఈ సంస్థ పర్మినెంట్‌ హీరో. ఆయన హీరోగా "రత్నమాల, లైలా మజ్నూ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి'' వంటి చిత్రాలను నిర్మించారామె. యన్‌.టి.రామారావు హీరోగా "చండీరాణి, వివాహబంధం, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దరు హీరోలతో ఆమె సొంత చిత్రాలలోనే కాకుండా ఇతర చిత్రాల్లోనూ నటించారు. ఆ తరువాత 'అంతా మనమంచికే' వంటి చిత్రాలనూ ఆమె నిర్మించారు. 1955లో ఆమె నిర్మించిన 'విప్రనారాయణ' చిత్రానికి జాతీయ అవార్డు లభించింది.
దర్శకురాలిగా...
భానుమతి తన స్వీయదర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం 'చండీరాణి' (1953). ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తూనే దర్శకత్వం, నిర్మాణం, సంగీత పర్యవేక్షణ వంటి బాధ్యతలనూ నిర్వహించారు. అదీగాక ఈసినిమాను హిందీ, తమిళ భాషల్లో కూడా నిర్మించి, మూడు చిత్రాలను ఒకేసారి విడుదల చేశారు. బహుశా ఈ రికార్డు మరే నటికి ఇప్పటి వరకు సాధ్యం కాలేదనే చెప్పాలి. తరువాత ఆమె దర్శకత్వంలో 'అమ్మాయి పెళ్ళి, అంతామనమంచికే, భక్త ధ్రువ మార్కండేయ' వంటి చిత్రాలూ రూపొందాయి. తన దర్శకత్వంలో యన్టీఆర్‌ హీరోగా చిత్రాలను నిర్మించిన భానుమతి తరువాత ఆయన దర్శకత్వంలో 'తాతమ్మకల', 'సమ్రాట్‌ అశోక'లో నటించారు.
గాయనిగా...
తన పాటలను తానే పాడుకొనే భానుమతి పదమూడేళ్ళ ప్రాయంలో ఏలాంటి మాధుర్యాన్ని పలికించారో, ఏడు పదులు దాటిన వయసులోనూ అదే మాధుర్యాన్ని తన గళంలో పలికించగలిగారు. 'స్వర్గసీమ'లో ఆమె పాడిన "ఓహో హో హో పావురమా...'' పాట ఆ చిత్రవిజయానికి ఎంతగానో తోడ్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇక పాటల పందిరిగా రూపొందిన 'మల్లీశ్వరి'లో ఆమె గాత్రంలో జాలువారిన ప్రతి పాటా అమృతమయమేనని నేడు కొత్తగ చెప్పవలసిన పనిలేదు. "సావిరహే తవ...'' (విప్రనారాయణ), "విరితావులలో...'' (లైలా మజ్నూ), "నీ వాలు కనులలో...'' (తెనాలి రామకృష్ణ), "శ్రీకర కరుణాలవాల...'' (బొబ్బిలి యుద్ధం), "రానీ రాజు రానీ...'', "ఎవరు రా నీవెవరురా...'' (అగ్గిరాముడు), "చరణం నీ దివ్య శరణం...'' (మట్టిలో మాణిక్యం), "నేనే రాధనోయి...'' (అంతా మనమంచికే), " ఎవరు కన్నారు ఎవరు కలగన్నారు...'' (తాతమ్మకల), "శ్రీరఘురామా... సీతారామా...'', "శ్రీ సూర్యనారాయణా మేలుకో...'' (మంగమ్మగారి మనవడు) వంటి పాటల్లో ఆమె గాత్రం నేటికీ వీనులవిందు చేస్తుంది.

రచయిత్రిగా...
"చండీరాణి, అంతా మనమంచికే, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలకు ఆమె కథ సమకూర్చారు. కొన్ని చిత్రాలకు రచన చేయడంలో పాలుపంచుకున్నారు. ఆమె రాసిన "నాలో నేను'', "అత్తగారి కథలు'' తెలుగు పాఠకులను ఎంతగానో అలరించాయి.
జ్యోతిషంలోనూ...
సంగీత సాహిత్యాల్లోనే కాకుండా, చిత్రలేఖనం, జ్యోతిషంలో కూడా ఆమెకు ప్రవేశముండేది. మోడరన్‌ థియేటర్స్‌ పతాకంపై టి.ఆర్‌. సుందరం నిర్మించిన 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రం షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు యమ్‌.జి.రామచంద్రన్‌, ఈమెను చూసి బెరుగ్గా ఉన్న సమయంలో ఆయన బెరుకు పోగొట్టేందుకు భానుమతి చనువుగా ఆయన చేయి తీసుకొని, తనకు తెలిసిన జోస్యం చెప్పారు. ఆ సమయంలో "ఏనాటికైనా నీవు రాజ్యాలేలే రోజుంది...'' అని భానుమతి, రామచంద్రన్‌తో అన్నారు. ఆ తరువాత అది అక్షరసత్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞ అన్ని విధాలా విజయం సాధించింది. కాబట్టి, ఆమెకున్న ప్రతి కళలోనూ ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు ఆమెను వరించి తీరాల్సిందే. అయితే ఆ ప్రజ్ఞాశాలి వడిని చేరే అదృష్టం అన్ని అవార్డులకూ ఉండొద్దూ!
అయితే కొన్ని అవార్డుల మాత్రం ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. అలాంటి వాటిలో 'పద్మశ్రీ', 'కలైమామణి', 'యన్టీఆర్‌ జాతీయ అవార్డు' వంటివి ఉన్నాయి. ఏదేమైనా విలక్షణ వ్యక్తిత్వంతో వి'చిత్ర'రంగంలో సలక్షణంగా తనకు తానే సాటి అనిపించుకున్న భానుమతి తెలుగుప్రజల హృదయ సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజ్ఞిగా నిత్యాభిషేకాలు జరుపుకుంటూనే ఉంటారన్నది జగమెరిగిన సత్యం! తెలుగు సినిమా చరిత్రలో భానుమతి అధ్యాయానికి సాటిరాగలది మరొకటి ఉదయిస్తుందన్న నమ్మకం ఏ తెలుగువాడికీ ఉండదని బల్ల గుద్ది చెప్పవచ్చు.