ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MANASULONI MALINYAM - KIDS STORY


మనసులోని మాలిన్యం

‘అమ్మా! బోరులో నీళ్లు మంచివే అంటారు కదా! అయినా కూడా రోజూ వాటిని మరిగిస్తావెందుకు?’ తొమ్మిదేళ్ల విశేష్‌ వాళ్లమ్మను అడిగాడు. ‘భూమిలోంచి కదా మనకు నీళ్లొస్తాయి. వాటిలో అనేక సూక్ష్మక్రిములు, వ్యాధిని కలిగించే మలినాలు ఉంటాయి. ఆ నీళ్లను అలాగే తాగితే రకరకాల జబ్బులొస్తాయి. అందుకే నీటిని కాచి తాగితే ఆరోగ్యం 

పాడవదు.’ చెప్పింది విశేష్‌ తల్లి. అర్థమైనట్టుగా తలూపాడు విశేష్‌. ‘ఇలా దేనిలోనైనా మలినాలుండటాన్నే మాలిన్యం అంటారు. అన్నట్టు మనలో కూడా మాలిన్యం ఉంటుందితెలుసా?’ అంది విశేష్‌ తల్లి. ‘అవునా? మొన్న నాకు కడుపునొప్పి వస్తే డాక్టరుగారు నులిపురుగులున్నాయని మందిచ్చారు కదా, అవేనా?’ ‘అవి శరీరంలో ఉండేవి. మన మనసులో కూడా మాలిన్యం ఉంటుంది.’ చెప్పింది. ‘మనసులోనా? అదెలా? మనసు పైకి కనపడదంటారు కదా? అదే కనపడకపోతే దానిలోని మాలిన్యాన్ని ఎలా శుభ్రం చేస్తాం?!’ ఆశ్చర్యంగా అడిగాడు విశేష్‌. ‘నిన్న నువ్వు స్కూలు నుంచి ఏడుస్తూ ఇంటికొచ్చావు కదా?!’ కొడుకును అడిగింది తల్లి. ‘అవునమ్మా. ఆ జయాంక్‌కే మొదటి ర్యాంకు రావడం నాకు నచ్చలేదు. వాడురాక ముందు ప్రతి పరీక్షలోనూ నాకే మొదటి స్థానం దక్కేది. అందుకే నిన్న ఏడుపొచ్చింది. కానీ అది మాలిన్యం ఎలా అవుతుంది?’ అన్నాడు విశేష్‌. ‘నీకు ర్యాంకు రాలేదన్న బాధ కన్నా జయాంక్‌కి వచ్చిందన్న బాధే ఎక్కువై అది అసూయగా మారింది. ఆ అసూయే మాలిన్యం’ చెప్పింది విశేష్‌కు తల్లి. ‘ఎక్కడినుంచో వచ్చి కొత్తగా మీ స్కూల్లో చేరిన జయాంక్‌కి నీకంటే బాగా మార్కులు వచ్చాయంటే దానర్థం వాడు నీకంటే బాగా చదువుతున్నాడని. ఇదివరకు మీ క్లాసులో నీదే మొదటి స్థానం. ఎప్పుడైతే నీ మొదటి స్థానాన్ని జయాంక్‌ తీసుకున్నాడో అప్పటి నుంచి నీలో వాడిపై అసూయతో పాటు కోపం కూడా వచ్చింది కదూ’ అంది అమ్మ. ‘అవునమ్మా!’ సిగ్గుతో తల వంచుకుని చెప్పాడు విశేష్‌. ‘ఇప్పుడు అనిపిస్తోందా, నీ మనసులోనూ మాలిన్యం ఉందని?’ ‘వూ... మరి దాన్ని వదుల్చుకోవడం ఎలా?’ దిగులుగా అడిగాడు విశేష్‌. ‘ఇవాళ స్కూలుకి వెళ్లగానే జయాంక్‌ని అభినందిస్తే సరి. అది వదిలిపోయినట్టే. ఈసారి అతనికన్నా కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించు’ చెప్పింది అమ్మ. ‘సరేనమ్మా’ అంటూ అమ్మకు టాటా చెప్పి బడికి బయలుదేరాడు విశేష్‌.