లలిత హారతి
శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదలకిదే నీరాజనం
పరమేశ్వరుని పుణ్యాభాగ్యాలారాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం.
బంగారు తల్లికిదే నీరాజనం
బంగారు హారాల సింగారు మొలికించు అంబిక హృదయకు నీరాజనం
శ్రీగౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహసనేశ్వరికి నీరాజనం.
బంగారు హారాల సింగారు మొలికించుహిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం
పాశాంకుశపుష్పబాణ చాపధరికి , పరమపావనమైన నీరాజనం.
ఆశ్రితుల పాలించి అభయంబు నొసగేటి లలితాంబ నీకిదే నీరాజనం, సింహ వాహినికి నీరాజనం.
కాంతి కిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం.
క్షీర సాగర తనయ సిరులోసగు మా తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం కనక మహాలక్ష్మికి నీరాజనం.
చిరునవ్వులోలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలవరేకులవంటి కన్నులమా తల్లి రాజరాజేశ్వరికి నీరాజనం.
జగదేక జనయిత్రి దీన జన బాంధవి కనకదుర్గమ్మకు నీరాజనం రాజరాజేశ్వరికి నీరాజనం.
ముదమారమోమున ముచ్చటగ ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహరికిదే నీరాజనం.
బంగారు హారాలసింగారు మొలికించు హిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహలక్ష్మికిదే నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి, శారదా మాయికిదే నీరాజనం.
చదువు సంధ్యలు ఇచ్చి చల్లంగా మము బ్రోచు వాక్దేవి నీకిదే నీరాజనం, సంకీర్తనంతో నీరాజనం.
ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం
జన్మజన్మల తల్లి జగధీశ్వరీ నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం.
ఆశ్రితుల పాలించి అభయంబునొసగేటి లలితాంబ నీకిదే నీరాజనం, సింహ వాహినికి నీరాజనం.
సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రి కిదే నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం, బంగారు తల్లికిదే నీరాజనం.
బంగారు హారాల సింగారుమొలికించు హిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.