చీరకట్టులో పలు విధాలు…
5
“చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది.. దాని దిమ్మదియ్యా… అందమంతా చీరలోనె ఉన్నదంటూ…” ‘బంగారు బాబు’ చిత్రంలో ఏఎన్నార్ పాడిన విధంగా చీరకట్టు అందమే అందం. నేటి నవయుగంలో ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, ఎన్నెన్ని వెరైటీ డ్రస్‌లు, మిడ్డీలు వచ్చినప్పటికీ చీరకట్టుకున్న క్రేజు మాత్రం తగ్గడం లేదు. అందుకే.. చీర కట్టును ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అన్నారు మన పెద్దలు.
దేశ మహిళల్లో అధిక శాతం మంది ధరించే దుస్తులలో అతి ముఖ్యమైనది చీర. అయితే ఈ చీర కట్టులో పలు రకాలు వున్నాయి. సాధారణంగా భారతదేశంలో ఎక్కువ మంది చీరను ఒకసారి నడుంచుట్టూ తిప్పి, కొన్ని మడతలు పెట్టి, మళ్ళీ సగం నడుంచుట్టూ తిప్పి రెండవ చివర పైటచెంగును ఎడమ భుజం మీద నుంచి వెనుకకు వదిలేస్తారు.
అదే గుజరాత్ రాష్ట్ర మహిళలు మాత్రం.. పైట చెరుగు కుడి భుజం మీద నుండి వేసుకుంటారు. ప్రాంతానికో రీతిలో కనిపించే చీర కట్టు అందమంతా ఆరు గజాల వస్త్రంలో ఉంటుంది. అయినా ఒక్కొక్కరి ఒంటిమీద అది ఒక్కో రకంగా సింగారాలు ఒలుకుతుంది.