అష్టవిధ నాయికలు భరతముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొన్న ఎనిమిది రకాల నాయికల గురించి చెప్పిన వివరణ. ఈ నాయికలు వేర్వేరు పరిస్థితుల్లో వారి ఎనిమిది రకాల మానసిక అవస్థలను తెలియజేస్తుంది..తన ప్రియుడు లేదా భర్త కోసం ఎదురు చూసే నాయిక మానసిక స్థితి గురించి అద్భుతంగా వివరించారు ఎందరో మహానుభావులు. ఈ అష్టవిధ నాయికల గురించి దేవులపల్లి కృష్ణ శాస్త్రి చెప్పిన వివరణ, అలాగే పి.సుశీల వివిధ సినిమాలలో పాడిన పాటలు కలిపిన మాలిక ఇది..
ఆ నాయికల వివరణ మామూలు మాటలలో
1.విరహోత్కంటిత : భర్త చెప్పిన వేళకు రాలేదని ,ఆలస్యానికి తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ.
2.ఖండిత నాయిక : తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి ,తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగడిని చూచి దుఃఖించే స్త్రీ.
3.స్వాధీన పతిక : తను చెప్పినట్లు విని, కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ.
4.ప్రోషిత పతిక : భర్త తనకు దూరం లో వున్నప్పుడు అతని తలపులు నెమరు వేసుకుంటూ విరహ వేదన పడే స్త్రీ.
5.వాసక సజ్జిత : దూరాన ఉన్న భర్త చాల రోజుల తరవాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో తను, తన పడక గదిని అలంకరించి ,ప్రియుని రాక కోసం ఎదురు చూసే స్త్రీ.
6.విప్రలబ్ద : తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రాక పోతే , విరహంతో భాద పడే స్త్రీ.
7.కలహాంతరిత : భర్త ఎంత చెప్పినను వినక ,అది అబద్ధమని నమ్మి,అతనితో దెబ్బలాడి వెల్ల గొట్టి, తరువాత అయ్యో! ఎంత పని చేసాను !ఎంత నోచ్చుకున్నాడో! అని దిగులు పడే స్త్రీ.
8.అభిసారిక : అందంగా అలంకరించుకుని ప్రియుని దగ్గరకు తానే వెళ్ళేదిగాని , లేదా ప్రియుడ్ని తన దగ్గరకు పిలిపించుకునే స్త్రీ.
ప్రవత్ప్యత్పతిక : ప్రియుడు దూర ప్రయాణానికి వెళుతున్నప్పుడు యా వాస్తవాన్ని తట్టుకో లేక కన్నుల నీరిడే తొమ్మిదవ కథానాయిక.