కార్తీకంలో బ్లాగ్ వనభోజనాలు
కార్తీకం అంటేనే సందడి.పూజలు,ఉపవాసాలు,కార్తీక దీపాలు.మధ్యలో వనభోజనాలు,మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.ప్రతి నెలా పౌర్ణమి వస్తూనే ఉన్నాకార్తీక పున్నమి ప్రత్యేకతే వేరు.నిండుచంద్రుని వెన్నెల్లో,వెలిగే దీపాల నడుమ,భక్తి ప్రపత్తులతో,సరదాల పరదాలతో సాగే భోజనాలు నిజంగా అపురూపమే.
ఇక వనభోజనాలు.
విశాలమైన తోటల్లోఉసిరిచెట్ల కింద భోజనాలు ఒకప్పుడైతే బ్లాగుల ముంగిట ఘుమఘుమల పరిమళాలు ఇప్పుడు.
మరి ఈ వెన్నెల వెలుగుల్లో నా వంటలు కూడా రుచి చూసేయండి.ఉపవాసంతో అలసిపోయే పెద్దలకు,పిన్నలకు రుచితో పాటు పోషకాలు కూడా ఇచ్చే ఈ తీయతీయని బాదం ఖర్జూర పాయసంచేసుకుందాం.దీన్నేఆల్మండ్ డేట్స్ ఖీర్ అని పిల్చుకున్నా వాకే .
కావలసినవి
చిక్కని పాలు పావు లీటరు
ఖర్జూరాలు పది
బాదంపప్పు పది
ఇలాచీ పొడి అర స్పూను
మిల్క్ మెయిడ్ రెండు టేబుల్ స్పూన్స్
ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేయ్యాలి.
ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.
ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు వాడొచ్చు.
ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి కొంచెం ఉడికించాలి.
చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత పంచదార వేసుకోవచ్చు.
ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది
సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి.
అంతేనండి చాలా సులువు కదా.కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే రుచి కూడా అంత మధురంగానూ ఉంటుంది.