నవ్వు నవ్వు నవ్వు మనసారా నవ్వు
అప్పుడప్పుడు ఏదో ఆలోచన, ఆవేశం,బాధ, స్పందన లాంటివన్నీ కధలుగానో,వ్యాసాలుగానో, కవితలుగానో బయటకు వస్తాయి. అలా రావడం కూడా మంచిదే. ఎందుకంటే జీవితానుభవాలనుండి పుట్టేదే సాహిత్యం కదా. అందుకే ఒకరోజు నాలో చెలరేగిన ఆలోచనలను పేస్ బుక్ లో ఇలా రాసుకున్నాను. చాలామంది బావుందన్నారు. ఇంగ్లీషులోకి కూడా అనువాదం చేసారు ఒక ఫ్రెండ్.. దాన్ని ఒక కవితాసంకలనంలో వేస్తామన్నారు సంపాదకులు. అందుకే ఈ కవితలాంటి నా మనోభావాలను ఇక్కడ నిక్షిప్తం చేద్దామనుకుంటున్నాను...
కోపంలో, బాధలో, దుఃఖంలో నవ్వు
తీరిగ్గా ఉన్నవేళ ప్రకృతిని చూసి నవ్వు
ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు చిరాకుపడకుండా మిగతావాళ్లని చూసి నవ్వు
హైవే మీద సాఫీగా వెళుతున్నప్పుడు మరింత హాయిగా నవ్వు
కష్టాల కడలిలో మునిగినప్పుడు ఇంకా చలేంటనుకుని వాటిని చూసి నవ్వు
సంతోష సమయంలో అంబరానికెగరక నేలను అదిమి చిన్నగా నవ్వు
ఆత్మీయులు, స్నేహితులని నమ్మి ఎలా ఫూల్ అయ్యావోతలుచుకుని మరీ నవ్వు
ఎన్నో విపత్తులలో భయపడ్డ సంఘటనలు గుర్తుచేసుకుని నవ్వు
ప్రతీదానికి విపరీతంగా ఆలోచించే, స్పందించే నిన్ను చూసుకుని నవ్వు
చుట్టూ ఉన్న సమస్యలను చూసి ఒక్కసారి గట్టిగా నవ్వు
మనసులోని దిగులును బయటకు పారద్రోలేలా నవ్వు
ఎవరు, ఎలాటివారో తెలుసుకుని లైట్ మామా అనుకుంటూ నవ్వు
ఎవరూ నీవారు కారు, నీ తోడు రారని గుర్తుంచుకుని నవ్వు
ఉన్నది చిన్న జీవితం. చేసుకుంటూ దాన్ని పదిలంగా నవ్వు
నిన్న మనది కాదు, రేపు మన చేతిలో లేదు. నేడు ని కాపాడుకుని నవ్వు
అన్నీ మరచి, అప్పుడప్పుడు మనసారా నవ్వు .. నవ్వు..