తెలుగు చిత్ర రంగ పితామహుడు
ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ మూలాలు మచిలీపట్నం లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎలాగంటే తెలుగు చిత్రసీమ వేళ్ళూనుకోవడానికి బాధ్యత తీసుకున్న తొలి వ్యక్తిగా చెప్పుకోదగ్గ మహనీయుడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన స్వస్థలం మచిలీపట్నం.
అప్పటివరకూ బొంబాయి, కలకత్తా వగైరా ప్రదేశాలకు వెళ్లి చిత్రసీమలో వివిధ విభాగాలలో పనిచేసిన వారేగానీ, చిత్రాలు నిర్మించే ధైర్యం చేసినవారు దాదాపుగా లేరనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తెలుగు చిత్రసీమ ఆవిర్భావానికి కృషి చేసిన వ్యక్తి వెంకయ్య.
మచిలీపట్నానికి చెందిన సుబేదారు రఘుపతి అప్పయ్య నాయుడు రెండవ కుమారుడు వెంకయ్య. ఈయనకు చిన్నప్పట్నుంచీ చదువు మీదకంటే కళలంటే ఆసక్తి ఎక్కువ. రాజా రవి వర్మ చిత్రాలన్నా, కొండపల్లి బొమ్మలన్నా ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తే ఆయన్ని చిత్రకారుణ్ణి, శిల్పినీ చేసాయి.
స్థానికంగా ఉండిపోతే ఆయన కళ వెలుగు చూడదని భావించిన అప్పయ్య నాయుడు గారు వెంకయ్య గారిని 1886 లో మద్రాసు పంపారు. అక్కడ మౌంట్ రోడ్డులో ఒక చిన్న ఇంట్లో నివాసముంటూ కళాకేంద్రం ప్రారంభించారు. అచిరకాలంలోనే అఖండ ఖ్యాతి గడించారు. అటు తూర్పునుంచి దక్షిణం వరకూ వున్నరాజ సంస్థానాలన్నీ
వెంకయ్యగారిని ప్రశంసలతో ముంచెత్తాయి. బ్రిటిష్ క్రింది స్థాయి అధికారినుండి గవర్నర్ వరకూ ఆయన్ని మెచ్చుకోన్నవారే !
వెంకయ్య గారు దీంతో తృప్తి పడక ఛాయాచిత్ర కళను అభ్యసించారు. అందులో ప్రయోగాలు కూడా చేశారు.
ఆ సమయంలోనే వార్తాపత్రికలలో వచ్చిన ఒక సమాచారం ఆయన్ని విశేషంగా ఆకట్టుకుంది. అది ' క్రోనో మెగా ఫోన్ ' అనే సినిమాటోగ్రాఫ్ యంత్రం కనుగోనబడిందని, దీంతో చిత్రం ప్రదర్శించేటపుడు రికార్డెడ్ డిస్క్ సాయంతో సంగీతం, ఇతర శబ్దాలు వెలువడతాయని ఆ సమాచారసారాంశం .
....... దీని సృష్టికర్తలైన లండన్ కి చెందిన గౌమాంట్ కంపెనీ బకింగ్ హాం ప్యాలస్ లో అయిదవ జార్జ్ చక్రవర్తి, రాణీ మేరీ ల సమక్షంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రదర్శన విజయవంతమైందని కూడా ఆ సమాచారంలో ఉంది.
వెంకయ్య గారు వెంటనే మదరాసులోని జాన్ డికెన్ సన్ అండ్ కంపెనీ వారి ద్వారా ఆ యంత్రాన్ని రు. 30,000 /- లకు కొన్నారు. దీనికోసం ఆయన తన ఫోటో స్టూడియోను తాకట్టు పెట్టారు.
'క్రోనో మెగా ఫోన్ ' తో మదరాసులో తొలి చిత్ర ప్రదర్శన విక్టోరియా పబ్లిక్ హాలులో ఏర్పాటు చేశారు. చెప్పుకోదగ్గ ఫలితం లేకపోయినా తర్వాత ప్రదర్శనలకు ఆదరణ పెరగసాగింది. ఇందులో పన్నెండు లఘుచిత్రాలు ప్రదర్శించడం జరిగింది.
1910 లో ఎస్ ప్లనేడ్ లో ఒక టెంట్ హాలు ఏర్పాటు చేసి ప్రదర్శనలిచ్చేవారు. ఇప్పుడక్కడ రాజా అన్నామలై హాలు ఉంది. తర్వాత ఆ టెంట్ తో బెంగుళూరు, ఆంధ్రలోని కొన్ని ముఖ్య పట్టణాలతో బాటు సిలోన్ ( శ్రీలంక ), బర్మా లాంటి ప్రదేశాలకు వెళ్లి ప్రదర్శనలిచ్చారు.
1911 లో మదరాసు నగరంలో మొదటి సినిమా థియేటర్ అయిన గెయిటీ టాకీస్ రఘుపతి వెంకయ్య నిర్మించారు. ఆదేకాకుండా మింట్ స్ట్రీట్ లో క్రౌన్ థియేటర్, పరశువాక్కం లో గ్లోబ్ థియేటర్ ( తర్వాత కాలం లో ' రాక్సీ ' ) నిర్మించారు. ప్రసిద్ధ యూనివర్శల్ పిక్చర్స్ వారి లఘు చిత్రాలు, మూకీ చిత్రాలు ఆ థియేటర్లో ప్రదర్శించేవారు.
1913 లో వెంకయ్య గారు ' స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ కంపెనీ ' అనే కంపెనీని స్థాపించి గ్లోబ్ థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో ఒక గ్లాసు స్టూడియో నిర్మించారు. ఆ రోజుల్లో విద్యుత్ సదుపాయం సరిగా లేకపోవడంతో సూర్యరశ్మి ఆధారంగా చిత్ర నిర్మాణం చేసేవారు.
వెంకయ్య గారి పెద్దకొడుకు ప్రకాష్ మొదట ఇంగ్లాండ్, జర్మనీ దేశాలకు వెళ్లి సినిమా సాంకేతికాంశాలలో శిక్షణ పొంది హాలీవుడ్ చేరుకున్నారు. అక్కడ సిసిల్ బి.డి. మిల్లీ, డి. డబ్ల్యు. గ్రిఫిత్ లాంటి ప్రఖ్యాత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసి మంచి సినిమా జ్ఞానాన్ని సంపాదించారు. అక్కడనుంచి వచ్చేటపుడు విలియంసన్ సైలెంట్ కెమెరాతో తిరిగివచ్చారు.
ఆర్.ఎస్. ప్రకాష్ సిసిల్ బి.డి. మిల్లీ దగ్గర ' టెన్ కమాండ్మెంట్స్ ' చిత్రానికి సహాయకునిగా పనిచేస్తున్నపుడు జరిగిన ఒక సంఘటన.
ఒకరోజు షూటింగ్ జరుగుతోంది. అది క్లోజ్ రేంజ్ షాట్. ఆ షూటింగ్ లో పాల్గొన్న పాత్రదారులందరూ శరీరంపై భాగంలో ఆచ్చాదన యేదీ లేకుండా కెమెరా ముందునుండి నడిచి వెడుతున్నారు. హటాత్తుగా ప్రకాష్ గారు ' కట్ ' చెప్పారు. మిల్లీకి చాలా కోపం వచ్చింది. ఎందుకు కట్ చెప్పావని గద్దించారు. దానికి ఆయన
" ఇది బైబిల్ కాలం నాటి కథ. కథాకాలం నాటికి వాక్సినేషన్లు లేవు. కెమెరా ముందు పోతున్న ఒక నటుడి చేతి మీద వాక్సినేషన్ గుర్తు స్పష్టంగా కనబడుతోంది. అందుకే కట్ చెప్పాను " అన్నారు.
ఆయన సునిశిత పరిశీలనకు సంతోషించి మిల్లీ ఆయన్ని తన ప్రథాన సహాయకునిగా తీసుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ తమ గ్లాస్ స్టూడియోలో ' గజేంద్ర మోక్షం ' . మత్స్యావతారం ' , 'నందనార్ ' , భీష్మ ప్రతిజ్ఞ ' మొదలైన చిత్రాలు నిర్మించారు.
అప్పట్లో తెలుగు, తమిళ స్త్రీలు సినిమాల్లో నటించడానికి ముందుకు రాకపోవడం చేత ఆంగ్లో ఇండియన్ స్త్రీల చేత ఆ పాత్రలు ధరింపజేసారు.
కెమెరాలో లెన్స్ లు పనిచెయ్యక పోవడం వలన ప్రకాష్ గారు తీసిన ' మీనాక్షి కళ్యాణం ' చిత్రం పాడయిపోయి వారిని ఆర్థికంగా కృంగదీసింది. ఫలితంగా వెంకయ్య గారి ఆస్థులతో బాటు గ్లాసు స్టూడియో కూడా చేజారి పోయింది. తర్వాత కాలంలో ప్రకాష్ గారు మిత్రులతో కలిసి తీసిన కొన్ని చిత్రాలు కూడా వారిని ఆదుకోలేక పోయాయి. తెలుగు వారికి చిత్ర పరిశ్రమనందించిన వెంకయ్య గారి చివరి దశ ఇబ్బందిగానే గడిచింది. చివరకు ఆయన 1941 లో స్వర్గస్థులయ్యారు.