ఆనంద తాండవం ' చిదంబరం '
చిదంబర నిలయుడు
అక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తే
చూసిన మన మనసు అంబరాన్ని తాకుతుంది .
ఆ ఆలయంలో ప్రతి స్థంభం నాట్యం చేస్తుంది
ఆ ఆలయంలో ప్రతి శిల్పం నర్తిస్తుంది
చెన్నైకి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో చెన్నై - తిరుచ్చి ప్రధాన రైలు మార్గంలో వున్న చిదంబరం లోని నటరాజ ఆలయ విశేషమది. శివుడు నటరాజుగా కొలువు తీరి వున్న ఆలయం చిదంబరం నటరాజ ఆలయం. శైవ, వైష్ణవ సిద్ధాంతాల మేలుకలయిక ఈ ఆలయం.
పంచభూతాలకు ప్రతిరూపంగా వెలసిన అయిదు ఆలయాల్లో చిదంబరంలోని ఆలయం ఆకాశానికి గుర్తు. మన మనసనే ఆకాశానికి చిహ్నం చిదంబరం. క్రీస్తు యుగం ప్రారంభానికి ముందే ఈ ఆలయమున్నట్లు చెబుతారు. శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని చోళ రాజులు పునరుద్ధరించారు. వారి తర్వాత పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయ వైభవానికి కృషి చేశారు.
ఈ ఆలయంలో అయిదు మంటపాలున్నాయి. అవి చిత్ సభ, కనక సభ, నాట్య సభ, రాజ్య సభ, దేవ సభ. ఇక్కడున్న శిల్ప రమణీయత చెప్పనలవికాదు.
చిదంబర రహస్యం : గర్భగుడిలోని నటరాజ విగ్రహానికి ఎడమవైపున శివగామి అమ్మవారు వుంటారు. కుడివైపున మాయా యవనిక ( ఒక నల్లని తెర ) వుంటుంది. దాని మీద కొన్ని బంగారు ఆకుల తోరణాలు వుంటాయి. ఎవరైనా అలౌకిక దృష్టితో తదేకంగా చూసినపుడు అక్కడ ఒక స్పష్టమైన రూపాన్ని దర్శిస్తే ఆది అనంతమైన శూన్యానికి అంటే ఆకాశానికి చిహ్నమవుతుంది. గర్భగుడిలో ఉండే శ్రీచక్రం, చిదంబర చక్రం, సమ్మేళన చక్రం, మహాతాండవ చక్రం, తిరస్కరణి చక్రం, ఆనంద చక్రం కలసి ఈ చిదంబర రహస్యాన్ని ఏర్పరుస్తాయని చెబుతారు. వీటిద్వారా ఆకాశ స్థానంలోని మూల ( కేంద్ర ) స్థానాన్ని చూడగలుగుతామట. ఒక గొప్ప సిద్దునికి పంచాక్షరి చక్రం మీద శ్రీచక్రం కలసి అందులోంచి నటరాజ రూపం సాక్షాత్కరించినదని చెబుతారు. ఈ యంత్రం అనంత విశ్వానికి ప్రతిరూపం. ఈ ఆకాశ లింగమే చిదంబర రహస్యం. అందుకే ఇక్కడ శివుడు నిరీశ్వరాకారుడు.
ఊర్థ్వ తాండవమూర్తి అయిన నటరాజు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. అద్భుతమైన శిల్ప రమణీయత, వాస్తు శైలి ఆ ఆలయ విశేషం. ఈ వేసవి యాత్రలో భాగంగా చిదంబర ఆలయాన్ని దర్శించిన సందర్భంగా కొన్ని విశేషాలు ఇవి. ఇంకా కొన్ని చిత్రాలు......