సేమ్యా పులిహోర
కావలసిన పదార్థాలు
సేమ్యా - 2 కప్పులు, నిమ్మకాయలు - 2
ఆవాలు - 1 స్పూను
పచ్చి సెనగపప్పు - 1 స్పూను
ఛాయ మినపప్పు - 1 స్పూను
వేరుసెనగలు - 1 స్పూను
ఆవపిండి - 1 స్పూను
అల్లంవెల్లుల్లి ముద్ద - 1 స్పూను
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 1, నూనె - తగినంత
ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 3
ఎండుమిరపకాయల పొడి - 2 స్పూన్లు
తయారీ విధానం
ముందుగా సేమ్యా ఉడికించుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. ఆ నీళ్లలోనే పసుపు, ఉప్పు, ఒక స్పూను నూనె వేయాలి. నీళ్లు తెర్లుతున్నప్పుడు సేమ్యా వేసుకోవాలి. సేమ్యా ఉడికిన వెంటనే చిల్లుల గిన్నెలోకి వేసి నీటిని ఓడ్చుకోవాలి. వేడిగా వున్న సేమ్యాలోనే అల్లంవెల్లుల్లి ముద్ద, ఆవపొడి వేసి కలపాలి. సేమ్యా చల్లారాక నిమ్మరసం కలుపుకోవాలి. చిన్న బాండీలో నూనెవేసి కాగిన తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి సెనగపప్పు, ఛాయమినపప్పు, వేరుసెనగలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి పొడి వేసి వెంటనే పొయ్యి కట్టేయాలి. దాన్ని సేమ్యాలో కలుపుకోవాలి. అంతే! సేమ్యా పులిహోర రెడీ! నిమ్మకాయ బదులు చింతపండు గుజ్జు లేక మామిడికాయ తురుమును కూడా వాడొచ్చు.