Bhakta Kannappa - Tinnadu - భక్త కన్నప్ప
ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.
అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.
తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ''అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా'' అని పిలిచాడు.
మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.
అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ''మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.
మహాశివుడు చిరునవ్వు నవ్వి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.
శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.
అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది.
రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.
తిన్నడు మరింత దుఃఖిస్తూ, ''శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..'' అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.
అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.
తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు.
శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు.