వామన నోము విధానం
కథ :
ఒకానొక రాజుకు ‘‘అమృతవల్లి’’ అనే అందమైన కూతరు వుండేది. ఆనాటి యువరాణులలోని అందాచందాలలో ఆమెకు ఆమె సాటి. దీంతో కేవలం అలనాటి రాజకుమారులే కాకుండా... వివాహితులైన ఎందరో రాజులు ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆశించేవారు. దీంతో ఇతర రాజకుమార్తెలు అమృతవల్లిపై ఈర్ష్య పెంచుకున్నారు. ప్రతిఒక్కరాజు ఆమెవైపే మొగ్గుచూపడంతో.. ఎవరు వీరిని వివాహం చేసుకోరు అనే భంగిమలో పడిపోయారు.
దీంతో వీరంతా ‘తంబళ’ అనే మంత్రికురాలి దగ్గరకు వెళ్లి అమృతవల్లి అందాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించారు. దాంతో తంబళ అమృతవల్లికి చెరుపు(హాని) పెట్టింది. అది మొదలు ఆమె అందాచందాలన్ని మాయమైపోయాయి. అలా జరిగిన ఆమెను చూసి.. రాజులందరూ ఆమె మీద పెంచుకున్న మోజును తగ్గించుకున్నారు. ఆమెను వివాహమాడేందుకు ఏ ఒక్కరాజు కూడా ముందుకు రాలేదు.
ఇదిలావుండగా.... తీర్థయాత్రలకు వెళ్లిన రాజపురోహితుడు తిరిగి వచ్చి ఈ విషయం గురించి తెలుసుకున్నాడు. తరువాత రాజు దగ్గరకు వెళ్లి... ‘‘మహారాజా! నేను కాశీలో వుండగా యువరాణిగారి విషాదగాధ గురించి తెలిసింది. అనుక్షణమే అక్కడ వున్న పండితులతో దీని గురించి చర్చించాను. రాజకుమార్తెకు జరిగినటువంటి సంఘటనలుగాని, కోపాలు, శాపాలు వంటివి వామన నోము చేయడం ద్వారా తొలగిపోతాయని వారు చెప్పారు. తొందరగా యువరాణి ద్వారా వామన నోమును పట్టించండి’’ అని చెప్పాడు. ఇలా నోమును నిర్వహించిన పదిరోజులకల్లా అమృతవల్లి తన అందాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి పొందింది.
* విధానం :
ఈ నోము ప్రతిఏటా భాద్రపద మాసంనాడు నిర్వహించుకుంటారు. ఆరోజు పైన చెప్పకున్న కథను ఒకసారి చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఈ భాద్రపద మాసంలో శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం వుండాలి. ఇలా ఉపవాసం వుండడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. శుద్ధ ద్వాదశి శ్రవణా నక్షత్ర ఘడియలలో, గాలీ వెలుతురూ బాగా వీచి, మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో ఈ పూజను నిర్వహించుకోవాలి.
గడ్డకట్టి, కదలకుండా వుండే పెరుగును ఒక పాత్రలో తీసుకోవాలి. పాత్ర మీద వామనుడి స్వర్ణ ప్రతిమ ఉంచి, ఒక చేత్తో పెరుగన్నం గిన్నె, మరొక చేత్తో అమృత కలశం ధరించి వున్నట్లుగా భావిస్తూ యధాశక్తి పూజించి దద్దోజనం నివేదించాలి. ఇలా పూజ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ప్రసాదాన్ని 12 మంది పేదవారికి కడుపునిండా పెట్టి, ఆ తరువాత తాము తినాలి. ఈ విధంగా ఈ పూజను 12 సంవత్సరాల వరకు చేయాలి.
* ఉద్యాపనం :
12వ సంవత్సరంలో ఈ నోము నిర్వహించుకునేటప్పుడు 12 పెరుగు పాత్రలు, 12 వామన విగ్రహాలు, 12 దద్దోజన పాత్రలు దానమివ్వడం సంప్రదాయం.
బాల్యం నుంచి ఈ నోమును నోచుకుంటే.. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి రోగాలు సోకవు. గాలీధూళీ సోకవు. ఈ నోము నిర్వహించిన తరువాత కూడా ఎటువంటి ఆపదలు ఏమైనా సంభవిస్తే.. మళ్లీ ఇంకొకసారి ఈ నోమును రెండుసంవత్సరాలవరకు నిర్వహించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. భక్తిగా ఆచరిస్తే గొప్ప ఫలితం ఉంటుంది.