లక్ష పసుపు నోము
కథ :
పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ దంపతులు వుండేవారు. బ్రాహ్మణుడు ఒక విద్యావంతుడు. గౌరవంగా బతకడానికి అన్నిరకాల సదుపాయాలు, సిరిసంపదలు అతని దగ్గర వుంటాయి. అయితే అతను నిత్యం ఏదో ఒక రోగానికి గురవుతూ, బాధలు పడేవాడు.
భర్త ఇలా తరచూ అనారోగ్యానికి గురికావడం చూసి అతని భార్య చాలా బాధపడేది. తనకు ఏ విధంగా సుఖం అందేది కాదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపంలో నిత్యం ఏడుస్తూ తన కాలాన్ని గడిపేది.
ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు వుండే ఊరికి ఒక యతీశ్వరుడు వస్తాడు. అతడు ఈ దంపతుల ఇంటికి చేరుకుంటారు. ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఈ యతీశ్వరుడిని అన్నిరకాల అతిథి మర్యాదలు చేసి, భోజనాలు పెడుతుంది. దీనికి ఆ యతీశ్వరుడు చాలా సంతోషిస్తాడు.
అప్పుడు ఆ యతీశ్వరుడు తన దివ్య దృష్టితో ఆమె పరిస్థితిని, ఆమె పడుతున్న బాధల్ని, ఆమె మనోవేదనను తెలిసుకుంటాడు. అతడు.. ‘‘ఓ సాధ్వీమణీ! నువ్వు చింతించకు. నీ బాధ నాకు అర్థమయింది. నువ్వు ఈ దీనపరిస్థితి నుంచి బయటపడడానికి నేనొక ఉపాయాన్ని అందిస్తాన్ని. నువ్వు ఆరునెలలవరకు లక్ష్మీ పసుపు నోమును నోచి, ఉద్యాపన చేస్తే.. అన్ని సమస్యలు చక్కబడుతాయి’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
యతీశ్వరుడు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణ ఇల్లాలు అదేవిధంగా నోమును నిర్వహించుకుంటుంది. అప్పటినుంచి ఆమె భర్త అనారోగ్యాలబారిన పడకుండా, పూర్ణాయువతో జీవితాన్ని సంతోషంగా గడిపేవాడు. తన భార్యను కూడా సుఖంగా చూసుకుని, ఆమె కోర్కెలను తీర్చేవాడు.
* విధానం :
లక్ష్మీ పసును నోమును నిర్వహించుకున్నవారు ఆరునెలలవరకు తూచాతప్పకుండా నియమించాలి. పైన చెప్పిన కథను ప్రతిరోజూ పఠించి, తలపై అక్షతలు వేసుకోవాలి. ఆరునెలల తరువాత ఏడవ నెల మొదటిరోజు ఉద్యాపన చేసుకోవాలి.
* ఉద్యాపన :
వెన్ను విరగని పసుపు కొమ్మలను లక్షవరకు ఏరుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మీని పూజించుకోవాలి. ఆ పసుపు కొమ్మలను, కుంకుమను తీసుకుని ఇంటి చుట్టూ వున్న వీధులన్నీ తిరిగి.. ఇంటింటా అందరికీ పంచాలి. ఒకవేళ కుదిరితే పిండివంటలు కూడా పంచుకోవచ్చు.