ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE IN TELUGU ABOUT THE HISTORY AND IMPORTANCE OF SRI SRI SRI KORAMEESALA NARASIMHA SWAMY TEMPLE AT ANAJI GUDEM - TELANGANA DISTRICT - INDIA


శ్రీ కోర మీసాల నరసింహ స్వామి. అనాజి గూడెం 

తెలంగాణలో ఎన్నో ప్రసిద్ద నరసింహ క్షేత్రాలున్నాయి. 
యాదగిరిగుట్ట, మట్టపల్లి, వాడపల్లి అందరికి తెలిసినవి. 

హైదరాబాద్, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాలలోను పురాతన నారసింహ ఆలయాలు ఉన్నాయి.
సహజంగా నారసింహ ఆలయాలు కొండల మీద ఉన్న గుహలలో అదీ ఎక్కువగా దక్షిణ ముఖంగా ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మృగ రాజైన సింహం ఉండేది గుహలోనే కదా !
భక్తుడైన ప్రహ్లాదునికి తండ్రి మూలంగా ఎదుర్కొన్న అప మృత్యు ప్రమాదాన్ని ఆపిన వాడు నారసింహుడే కదా!
దక్షిణం యమ స్థానం !

ఆ దిశగా కొలువుతీరిన స్వామి తన భక్తుల మృత్యు భయాన్ని తొలగిస్తాడు అన్నది పెద్దల మాట.
అలా ఒక చిన్న గుట్ట మీద గుహలో కొలువుతీరిన స్వామిని స్థానిక భక్తులు శ్రీ కోర మీసాల నరసింహునుగా పిలుచుకొంటూ ఎన్నో శతాబ్దాలుగా కొలుచుకొంటున్నారు.
భువన గిరి నుండి వలిగొండ వెళ్ళే రహదారిలో వచ్చే అనాజి గూడెంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చిన్న గుట్ట మీద గుహలో కొలువుతీరిఉంటారు శ్రీ కోర మీసాల నారసింహ స్వామి.
పూర్తిగా పెద్ద పెద్ద కొండ రాళ్ళతో సహజ సిద్దంగా ఏర్పడిన గుహ ఇది.
గుహ ముఖ ద్వారం వద్ద శాఖోపశాఖలుగా పెరిగిన పెద్ద వట వృక్షం గుట్టనంత కప్పి చల్లని నీడను ప్రసాదిస్తుంది.

గుహ లోపల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఎడమ తొడ మీద అమ్మ వారిని కూర్చోబెట్టుకొని ప్రసన్న వదనంతో భక్త రక్షకునిగా తూర్పు ముఖంగా కొలువుతీరి దర్శనమిస్తారు.
గుహ ముఖ ద్వారం మాత్రం దక్షిణ దిశ గానే ఉంటుంది.

ఈ స్వామికి మిగిలిన నారసింహ రూపాల మాదిరిగా కాకుండా కోర మీసాలు ఉండటం విశేషం. అందుకే శ్రీ కోరమీసాల నరసింహునిగా భక్తులు పిలుస్తారు.
సమీపంలోని యాదగిరి కన్నా ముందే ఇక్కడ స్వామి కొలువు తీరారన్నది స్థానిక నమ్మకం.
క్షేత్రము గురించిన పురాణ గాధ ఏది అందుబాటులో లేదు.గుహకు వెలుపల అంజనా సుతుని సన్నిధి ఉంటుంది.

హనుమంతుడు స్వయంభూ గా వెలిసారని అంటారు.చెట్ల కొమ్మల మధ్య నుండి పరిశీలనగా చూస్తే నాగ పడగ ఆకారంలో సహజ సిద్దం గా రూపొందిన శిల ఒకటి కాన పడుతుంది.
ఇక్కడ వెలసిన శ్రీ నారసింహ స్వామి నాగ దోషాలను తొలగించే వానిగా ప్రసిద్ది.
మొక్కిన మొక్కులుగా గంటలను స్వామి కి సమర్పించుకోవడం మరో ప్రత్యేకత.
ప్రతి నిత్యం పూజాదికాలు జరిగే ఈ గుహాలయంలో నారసింహ జయంతిని, హనుమత్ జయంతిని ఘనంగా జరుపుతారు.

అన్ని పర్వదినాలలో స్థానిక భక్తులు తరలి వచ్చి శ్రీ లక్ష్మీ నారసింహుని, శ్రీ ఆంజనేయుని దర్శించుకొంటారు.

శ్రీ నరసింహ !! జయ నారసింహ !!!