ఇంద్రకీలాద్రి పై అమ్మవారు రేపటి రోజున లలిత త్రిపుర సుందరి దేవి గ దర్శనం ఇస్తుంది.
“ ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ‘’
త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టానదేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దార్రిద్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముతైదువలు) ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈనాడు అమ్మవారిని యధా శక్తితో పూజించి, కుంకుమార్చన చెయ్యాలి మరియు లలితా అష్టోత్తరంతో పూజించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులను పూజ చెయ్యాలి. శ్రీమాత్రే నమః